ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!

ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!

Published on Sep 16, 2025 7:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’ కోసం అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విడుదల తేదీ సమీపిస్తున్న క్రమంలో ప్రమోషన్లు వేగం పెంచిన చిత్ర బృందం, తాజాగా హీరోయిన్ ప్రియాంక మోహన్ మీడియాతో మాట్లాడి, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ గారితో ఓజీ ప్రయాణం గురించి చెప్పండి?

ఓజీతో దాదాపు రెండున్నరేళ్ల ప్రయాణం నాది. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓజీ సినిమాలో కణ్మని పాత్ర చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో కణ్మని నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. అలాగే ఓజీ చిత్రం నాకు ఎప్పటికీ చాలా స్పెషల్. పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం అనేది ప్రతిరోజూ అదృష్టమే. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను.

కణ్మని పాత్ర ఎలా ఉండబోతుంది?

ఇది 1980-90లలో జరిగే కథ. పాత్రను మలిచిన తీరు కానీ, ఆహార్యం కానీ అప్పటికి తగ్గట్టుగానే ఉంటుంది. కణ్మని ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కణ్మని.

సువ్వి సువ్వి పాటకు ఈ స్థాయి స్పందన వస్తుందని ముందే ఊహించారా?

థమన్ గారితో మొదటిసారి పని చేశాను. ప్రతి పాటకి వైవిధ్యమైన సంగీతం అందించారు. ఇందులో ఆయన స్వరపరిచిన మొదటి పాట ‘సువ్వి సువ్వి’నే. ఈ పాటను అందరికీ వినిపించాలని ఎంతగానో ఎదురుచూశాను. విడుదల తర్వాత అందరికీ సాంగ్ నచ్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

సెట్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడేవారు?

ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడతారు. ఆయన చదివిన కథలు, నవలల గురించి చెప్తారు. చరిత్ర గురించి మాట్లాడతారు. అప్పుడప్పుడు సినిమాలు, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ప్రజల గురించి ఎక్కువ మాట్లాడతారు.

దర్శకుడు సుజీత్ గారి గురించి?

సీన్ ఎలా తీయాలి, నటీనటుల నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలి.. ఇలా ప్రతి విషయంపై ఆయనకు స్పష్టత ఉంది. నా క్యారెక్టర్, లుక్ బాగున్నాయంటే దానికి కారణం సుజీత్ గారే.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ గురించి?

నాకు హోమ్ ప్రొడక్షన్ లాగా అయిపోయింది. డీవీవీ బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. నిజానికి నేను మొదట ఓజీ సినిమానే అంగీకరించాను. కానీ, సరిపోదా శనివారం చిత్రం ముందు విడుదలైంది. నిర్మాతలు దానయ్య గారు, కళ్యాణ్ గారు చాలా మంచి మనుషులు. వాళ్లంటే నాకు అపారమైన గౌరవం.

తదుపరి ప్రాజెక్ట్ లు?

తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. అలాగే, వేరే భాషల్లో పలు సినిమాలు చేస్తున్నాను.

తాజా వార్తలు