కెరీర్ మొదట్లో ‘చిత్రం’, ‘నువ్వు – నేను’ మరియు ‘జయం’ లాంటి ప్రేమ కథా చిత్రాలు తీసి విజయం సాదించిన డైరెక్టర్ తేజ, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీసు దగ్గర డిజాస్టర్స్ కావడంతో డీలా పడిపోయిన తేజ త్వరలోనే సాయిరామ్ శంకర్ హీరోగా మరో చిత్రం తీయబోతున్నారు. సునీత ప్రభాకర్ మరియు సీత నెక్కంటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క విశేషాలు తెలియజేస్తూ ‘ మేము సాయిరామ్ శంకర్ తో వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాం. అందులో ఒక చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్నారు మరియు ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. రెండవ చిత్రానికి ప్రశాంత్ వర్మ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు మరియు ఈ చిత్రం ఆగష్టు చివరి వారం నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది క్రైమ్ మరియు కామెడీ కలగలిపిన సినిమా. ఈ చిత్రాలకు సంభందించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాము. అలాగే మా బ్యానర్ లో వస్తున్న ‘ సినిమాకెల్దాం రండి’ అనే సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని’ తెలిపారు. ఎలాగైనా హిట్ కొట్టి తన పూర్వ వైభవాన్ని పొందాలని పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలు చేస్తున్న తేజ ఈ చిత్రంతోనైనా హిట్ కొడతాడా లేక పాత మూసధోరణిలోనే సినిమా తీసి మళ్ళీ మరో ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకుంటాడా అనే దానికోసం ఇంకొంతకాలం వేచిచూడాల్సిందే.