ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేయనున్న శ్రుతి హాసన్


శ్రుతి హాసన్ తన రాబోయే హిందీ చిత్రంలో తన డాన్సులతో ప్రేక్షకులను ఆశ్చర్య పరచనుంది. ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి నుంచి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తోంది. ఇటీవలే విడుదలైన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో కూడా నటనకు మరియు అందానికి ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేసి తొలి సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అంతే కాకుండా ఐశ్వర్య ధనుష్ తీసిన ‘3’ చిత్రంలో ఆమె నటన చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రభుదేవా సినిమాలో మొదటి సారిగా తన డాన్సింగ్ స్కిల్స్ ని కూడా చూపించబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో ఒక పాటకు సంభందించిన రిహార్షల్స్ జరుగుతున్నాయి. ఈ పాటకి స్వయంగా ప్రభుదేవా గారే కొరియోగ్రఫీ చేస్తున్నారు మరియు శ్రుతి కూడా తన డాన్సులతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఎంతో కష్ట పడుతున్నారు. ‘ టిప్స్ ఫిల్మ్స్ తో చేస్తున్న నా చిత్రం మొదటి రోజు చిత్రీకరణ పాటతో ప్రారంభమైంది. ఎంతో మంది డాన్సర్లు మరియు ఆర్టిస్ట్ లు సెట్ లో ఉన్నారు. ఇది చూస్తుంటే షూటింగ్ చేస్తున్నట్టు లేదు, ఒక పండగలా ఉంది’ అని శ్రుతి తన ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ‘ ఈరోజు బాగా వర్షం పడేలా ఉంది, అయినా గిరీష్ మరియు శ్రుతి ఇద్దరూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు’ అని ప్రభుదేవా ట్వీట్ చేసారు.

ఇప్పటివరకు తన నటన మరియు పాటలతో ఆకట్టుకున్న శ్రుతి హాసన్ ఈ చిత్రం ద్వారా తన డాన్సులతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రానికి రిమేక్. ఈ చిత్రం ద్వారా గిరీష్ తరుణి హీరోగా పరిచయమవుతున్నాడు. టిప్స్ ఫిల్మ్స్ బ్యానర్ పై కుమార్ తరుణి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version