ఖరారైన రామ్ చరణ్ – వినాయక్ సినిమా టైటిల్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు వి.వి వినాయక్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రానికి ‘నాయక్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం యొక్క టైటిల్ గురించి తమన్ త్వీట్ చేశారు. ‘ రామ్ చరణ్ మరియు వి.వి వినాయక్ తో చేస్తున్న నా మొదటి చిత్రం యొక్క టైటిల్ ని నేను తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి ‘నాయక్’ అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్ర టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది మరియు చాలా పవర్ఫుల్ గా ఉంది’ అని తమన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో చిరంజీవి నటించిన ‘కొండవీటి దొంగ’ చిత్రంలోని ‘శుభలేఖ రాసుకున్న’ అనే పాటను రీమిక్స్ చేస్తున్నానని తమన్ ఇది వరకే తెలిపారు. ఇటీవలే కోల్ కతా లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం మరో షెడ్యూల్ కోసం త్వరలోనే యూరప్ వెళ్ళనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2013 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version