తెలుగు సినీ పరిశ్రమలో మంచి అభిరుచి కలిగిన దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. తొలి చిత్రం గమ్యంతోనే ప్రత్యేకతను చాటుకున్న ఆయన, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు క్రిష్ ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
దాదాపు దశాబ్దన్నర తర్వాత ఆయన మళ్లీ అనుష్కను ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. వేదంలో సరోజ పాత్రను చూసి, ఆ క్యారెక్టర్‌పై ప్రత్యేకంగా సినిమా తీయాలని అనుకున్నానని, కానీ ఆ పాత్రను చెడగొట్టేస్తామేమోనని వెనక్కి తగ్గానని క్రిష్ చెప్పారు.
అయితే ఘాటిలోని శీలావతి పాత్ర కూడా సరోజకు ఏమాత్రం తీసిపోనిది అని, ఈసారి మరింత బలమైన కథతో వచ్చానని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అనుష్క శక్తివంతమైన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ఆమె సినిమాలు బాగా నచ్చితే ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నానని క్రిష్ వెల్లడించారు.