అల్ టైం బ్యూటీ శ్రీ దేవికి జన్మదిన శుభాకాంక్షలు


ఇప్పటికీ ఏ మాత్రం వన్నె తగ్గని అందంతో, అమాయకత్వమైన ముఖబింబంతో మరియు అద్భుతమైన నటనతో ప్రపంచమంతా అభిమానుల్ని సంపాదించుకున్న అందాల భామ శ్రీ దేవి పుట్టిన రోజు ఈ రోజు. 1963 ఆగష్టు 13న జన్మించిన శ్రీ దేవి తన బాల్యం అంతా చెన్నైలోనే గడిపింది. 1967 లో వచ్చిన ‘కందన్ కరునై’ అనే సినిమా ద్వారా తమిళ తెరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యారు. 1971లో వచ్చిన ‘భార్య బిడ్డలు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే పరిచయమయ్యారు. 1977లో వచ్చిన ‘బంగారక్క’ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారు కానీ అది అంతగా గుర్తింపు నివ్వలేదు, ఆ తర్వాత 1978లో వచ్చిన ‘పదహారేళ్ళ వయసు’ చిత్రం శ్రీదేవికి మంచి గుర్తింపు మరియు స్టార్డమ్ తెచ్చిపెట్టింది.

1970 ,1980 మరియు 1990 ల్లో అంటే సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగు , తమిళం మరియు బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు ఆరాధ్య నటిగా మారారు. 1990 నాటికి ఇండియాలోనే ఫేమస్ హీరొయిన్ గా ఎదిగారు మరియు ఇండియన్ చలన చిత్ర రంగంలోని కథానాయికలలో ‘సూపర్ స్టార్ శ్రీదేవి’ అనిపించుకున్న మొట్ట మొదటి హీరోయిన్ ఘనత కూడా శ్రీ దేవి గారికే దక్కింది.

పెళ్ళైన తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్రీ దేవి ఈ సంవత్సరం ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ అనే చిత్రం ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే తెలుగులో భారీగా తెరకెక్కనున్న ఒక మల్టీ స్టారర్ చిత్రం కోసం కూడా శ్రీ దేవిని సంప్రదించారు.

ఈ సందర్భంగా ప్రేక్షకుల ఆరాధ్య హీరొయిన్ అయిన శ్రీ దేవికి 123 తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version