టాలీవుడ్ ‘ప్రిన్స్ మహేష్’ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు


టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి వారసుడిగా తెలుగు తెరకు పరిచయమై తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల చేత ప్రిన్స్ గా పిలిపించుకున్న హీరో మహేష్ బాబు. ప్రిన్స్ అనే తన బిరుదుకి తగ్గట్టుగానే మహేష్ బాబు ఉంటారు మరియు మహేష్ బాబుని ఎంతోమంది అమ్మాయిలు తమ కలల రాకుమారిడిగా ఊహించుకుంటూ ఉంటారు. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి రాజ కుమారుడి పుట్టినరోజు ఈ రోజు. 1975 ఆగష్టు 9న చెన్నైలో జన్మించిన మహేష్ తన నాలుగవ ఏటనే ‘నీడ’ అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 8 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మహేష్ 1999లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘రాజకుమారుడు’ చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇప్పటి వరకూ 17 చిత్రాల్లో నటించిన మహేష్ బాబు ‘మురారి’, ‘ఒక్కడు’, ‘అతడు’, ‘పోకిరి’, దూకుడు’ మరియు ‘బిజినెస్ మాన్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను తనఖాతాలో వేసుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా ‘నాని’, ‘మురారి’ మరియు ‘నిజం’ లాంటి వైవిధ్యమైన సినిమాలను కూడా తీసి మంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవలే ఒక బుజ్జి పాపకి తండ్రి అయిన మహేష్ బాబుకి ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. చాలా కాలం క్రితమే ఆగిపోయిన మల్టీ స్టారర్ చిత్రాలకు మళ్ళీ శ్రీకారం చుట్టిన ఘనత కూడా మహేష్ బాబుకే దక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్నారు. టాలీవుడ్లో బాగా ఫేమస్ ఉన్న ఇద్దరు పెద్ద హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించి చాలా కాలం అవుతోంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఇది కాకుండా మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. మహేష్ ఇలానే ఎప్పటి కప్పుడు వివిధమైన సినిమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంటూ,ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుందాం.

ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున టాలీవుడ్ ప్రిన్స్ కి( కలల రాకుమారిడికి) హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ స్టిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి — క్లిక్ హియర్

Exit mobile version