ఎ.ఎన్.ఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు

ఎ.ఎన్.ఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు

Published on Sep 20, 2013 8:34 AM IST

akkineni-nageswara-rao
తెలుగు సినిమా రంగంలో అసలు సిసలైన లివింగ్ లెజండ్ డా. అక్కినేని నాగేశ్వరరావు. ఈ విలక్షణ నటుడు ఈ రోజు తన 90వ పుట్టిన రోజు వేడుకని జరుపుకుంటున్నారు. ఆయన 90 సంవత్సరాల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్షరాలా 75 సంవత్సరాలైంది. 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాలోని రామాపురం అనే గ్రామంలో ఓ రైతు కుటుంబంలో ఎ.ఎన్.ఆర్ జన్మించాడు. ఆయన తన 17వ ఏట ‘ధర్మపత్ని’ సినిమాతో తెలుగు సినిమాల్లో నటుడిగా అరంగేట్రం చేసాడు. ఆయన్ని రైల్వే స్టేషన్ లో చూసిన నిర్మాత ఘంటసాల బలరామయ్య ఎ.ఎన్.ఆర్ కి మొదటి సినిమా చాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత అనతికాలంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత 7 దశాబ్దాల కెరీర్ లో ఎ.ఎన్.ఆర్ సుమారు 250 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాల్లో ‘దేవదాసు’, ‘ప్రేమాభిషేకం’, ‘దసరా బుల్లోడు’, ‘ప్రేమ్ నగర్’, ‘చెంచు లక్ష్మి’, ‘మాయాబజార్’, ‘సీతారామయ్య గారి మనవరాలు’ మొదలైన సినిమాలు మైలురాళ్ళుగా నిలిచిపోయాయి.

ఎ.ఎన్.ఆర్ లవర్ బాయ్ గా, పూజారిగా, తండ్రిగా, తాతయ్యగా, తమ్ముడిగా, తాగుబోతుగా, ప్లే బాయ్ గా, అలాగే దేవుడిగా కూడా కనిపించి ప్రేక్షకులను రంజింపజేశాడు. ఈ అలుపెరగని సినిమా ప్రయాణంలో ఎ.ఎన్.ఆర్ ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నాడు, అందులో 1990లో దాదా సాహెబ్ పాల్కే అవార్డు, 2011లో పద్మ విభూషణ్ అవార్డులను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఎ.ఎన్.ఆర్ మనం సినిమాలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా 90 ఏళ్ళ బాలుడు అక్కినేని నాగేశ్వరరావుకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

తాజా వార్తలు