పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ షూటింగ్ కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని ఈ రోజు సెన్సార్ సభ్యుల ముందుకు వెళ్లనుంది. ఇటీవలే యూరప్లో పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హసన్ నటిస్తుంది. పవన్ కళ్యాణ్ సోదరుడిగా అజయ్ నటిస్తుండగా, తల్లి పాత్రలో సుహాసిని గారు నటించారు. కోట శ్రీనివాస రావు, నాగినీడు, అభిమన్యు సింగ్, తనికెళ్ళ భరణి, అలీ, గాయత్రి ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. హిందీలో భారీ విజయం సాధించిన ‘దబంగ్’ సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్ర ఆడియో ఇప్పటికే ప్రజాదరణ పొందింది.