‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ కోసం ముందుగా అందాల భామ లక్ష్మీ రాయ్ ని తీసుకోవాలని సంప్రదింపులు జరిపారు. ఆ పాట చేయడం కోసం ఆమె అంత సముఖత చూపకపోవడంతో చార్మింగ్ బ్యూటీ ఛార్మిని ఐటెం సాంగ్ చేయమని కోరగా ఆ సాంగ్ చేయడానికి ఛార్మి కూడా సముఖత వ్యక్తం చేసారని సమాచారం. నాగార్జున నటించిన ‘రగడ’ సినిమాలో మొదటిసారిగా ఛార్మి ఒక ప్రత్యేక గీతంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. మళ్ళీ రెండవ సారి ‘డమరుకం’లో నాగార్జునతో కలిసి చిందేయనున్నారు. ప్రస్తుతం ఈ పాటను హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలోని సెవెన్ ఎకర్స్ లో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు.
నాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మరియు అధునాతన గ్రాఫిక్ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యోగా టీచర్ అనుష్క కథానాయికగా నటిస్తోంది మరియు యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారు.