ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదలైన డబ్బింగ్ సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఈ సంవత్సరం తెలుగు సినిమాల జోరు బాగా ఉండటంతో డబ్బింగ్ సినిమాలని జనాలు తిప్పి కొడుతున్నారు. 2012 లో విడుదలైన రౌద్రం, స్నేహితుడు, డియర్, ధోని, మల్లిగాడు, రేణిగుంట, కిలాడి, 3, ప్రేమలో పడితే, 50% లవ్, శకుని, నిరంతరం నీ ఊహలే డబ్బింగ్ సినిమాలు విడుదల కాగా స్నేహితుడు ఒక్కటే యావరేజ్ గా నిలిచింది.
ఈ వారం రెండు డబ్బింగ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి జీవా హీరోగా నటించిన ‘మాస్క్’ కాగా మరొకటి ‘ఓకే ఓకే’. గతంలో జీవా నటించిన ‘రంగం’ తెలుగులో భారీ హిట్ కావడంతో అతడు నటించిన సినిమాలన్నీ తెలుగులో విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. జీవా సూపర్ హీరోగా మిస్కిన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ముగమూడి’ అనే తమిళ్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ నెల 31న విడుదల చేయనున్నారు. జీవా సరసన పూజా హెగ్డే హీరొయిన్ గా నటించిన ఈ సినిమాకి కృష్ణ కుమార్ సంగీతం అందించాడు.
మాస్క్ తో పాటుగా విడుదలవుతున్న మరో సినిమా ఓకే ఓకే. ఘటికుడు, సెవెంత్ సెన్స్ వంటి సినిమాలని నిర్మించిన ప్రముఖ తమిళ నిర్మాత ఉధయనిది స్టాలిన్ హీరోగా మారి చేసిన మొదటి సినిమా ఓకే ఓకే. హన్సిక హీరొయిన్ గా నటించిన ఈ సినిమా తమిళ్లో మంచి విజయాన్ని సాధించింది. ఈ నెల 31న ప్రముఖ తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేయబోతున్నారు.