కన్నడ హీరో యష్ క్రేజ్ ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. ‘కెజిఎఫ్’ భారీ సక్సెస్ కావడంతో అనేక మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. దేశవ్యాప్తంగా ఆయనకు ఫాన్స్ ఏర్పడ్డారు. ఇక కర్ణాటకలో అయితే డైహార్డ్ ఫాన్స్ తయారయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా ఒక్కొక్కసారి అభిమానుల అభిమానం హీరోలను కూడ ఆలోచనలో పడేలా చేస్తుంది. అలాంటి ఘటనే యష్ కు ఎదురైంది.
కర్ణాటక, మాండ్య జిల్లాకు చెందిన రామకృష్ణ అనే 25 ఏళ్ల యువకుడు ఉరువేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత కారణాల రీత్యా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోతూ అతను సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన సమస్యలను వివరించి చివర్లో తనకు హీరో యష్, మాజీ సీఎం సిద్దా రామయ్య అంటే ఎంతో ఇష్టమని, తన అంత్యక్రియలకు వారిద్దరూ హాజరుకావాలనేదే తన చివరి కోరిక అని చెప్పుకొచ్చాడు. ఈ సంగతి యష్ ను కలిచివేసింది. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన ‘అభిమానుల అభిమానమే మాకు బలం. రామకృష్ణ అభిమానం వెలకట్టలేనిది. కానీ అభిమానుల నుండి తాము ఆశించేది ఇది కాదు. చప్పట్లు, ఈలలు మాత్రమే’ అంటూ తన వేదన్నాడు చెప్పుకోచ్చారు.