అల్లు అర్జున్ విలన్‌కు భారీ భద్రత.. ఏకంగా ‘Y+’ క్యాటగిరీ సెక్యూరిటీ


నటుడు రవికిషన్ అంటే మన తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తుపట్టలేకపోవచ్చు కానీ అల్లు అర్జున్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రేసు గుర్రం’ విలన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా తన నటనతో అలరించారు రవికిషన్. ఈ భోజ్పూరి నటుడు ఆ తర్వాత ‘సుప్రీం, సైరా’ సినిమాల్లో కూడ కీ రోల్స్ చేశారు. ఈయన నటుడు మాత్రమే కాదు.. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ కూడ. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా రవి కిషన్‌కు ‘Y+’ క్యాటగిరీ సెక్యూరిటీని కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

రవికిషన్ ఈమధ్య పార్లమెంట్లో బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోందని, యువత తప్పు దోవ పడుతోందని నటులకు డ్రగ్స్ రాకెట్ తో ఉన్న సంబంధాలు బయటపెట్టేలా సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎంపీ జయాబచ్చన్ సహా అనేకమంది సినీ పరిశ్రమవారు ఖండించారు. సినీ పరిశ్రమకు చెందిన రవికిషన్ ఇలా మాట్లాడటం సబబు కాదని అన్నారు. అయినా రవికిషన్ తన వ్యాఖ్యల మీద వెనక్కు తగ్గలేదు. దీంతో ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి.

మొదట్లో వాటిని అంతగా పట్టించుకోకపోయినా బెదిరింపులు ఎక్కువ కావడంతో ఆయన ముఖ్యమంత్రికి భద్రత కల్పించమని లేఖ రాశారు. స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు ‘Y+’ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించారు. దీంతో రవికిషన్ ‘నేను, నా కుటుంబం, నా నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటాం. పార్లమెంట్లో నా గొంతుకను వినిపిస్తూ ఉంటాను’ అన్నారు. ఇకపోతే డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు పలువురు నటీమణులను విచారిస్తున్నారు.

Exit mobile version