తమ సినిమా ప్రమోషన్లలో ప్రేక్షకుల్లో సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు దర్శకనిర్మాతలు పలు స్టేట్మెంట్స్ చేస్తుంటారు. ‘‘సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వాపస్’’ లాంటి స్టేట్మెంట్స్ మనం చాలా చూశాం. అయితే, ఇటీవల రిలీజ్ అయిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్ర ప్రమోషన్స్‌లో డైరెక్టర్ మోహన్ శ్రీవత్స సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే తన చెప్పుతో కొట్టుకుంటానని బోల్డ్ స్టేట్మెంట్ చేశారు.
ఇక ఇప్పుడు ఆయన అన్నంత పని చేశారు. ఇటీవల రిలీజ్ అయిన ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట సింహా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రెస్పాన్స్ రాకపోవడంతో దర్శకుడు మనస్తాపానికి గురయ్యాడు. ఓ థియేటర్‌కి వెళ్లిన ఆయనకు అక్కడ కేవలం పది మందే కనిపించారని.. వారిని సినిమా ఎలా ఉందని అడిగితే బాగానే ఉందని చెప్పారని.. మరి ఇలాంటి సినిమాలకు ఆదరణ ఎందుకు రావడం లేదో.. మలయాళ సినిమాలను ఆదరిస్తున్నారుగా.. అంటూ ఆయన ఎమోషనల్ అవుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఇకపై తాను మలయాళంలో సినిమాలు చేసి అక్కడ విజయం సాధిస్తానని చెప్పుకొచ్చారు. అంతేగాక “ఈ సినిమా నచ్చకపోతే నేను నా చెప్పుతో కొట్టుకుంటా” అన్న తన మాటను నిజం చేస్తూ, వీడియోలో చెప్పుతో తనను తాను కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.