ఆంధ్రాలోని సినిమా థియేటర్లకు పూర్వపు కళ రానుంది. లాక్ డౌన్ అనంతరం పలు నిబంధనలు, సంకోచాల నడుమ సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు తమకు నష్టాలు తప్పట్లేదని వాపోయారు. వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కానీ ఆ నిర్ణయం కేంద్రం పరిధిలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయాయి. ఈ విషయం మీద దృష్టిపెట్టిన కేంద్రం కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడం, ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలకు అలవాటు పడటంతో 100 శాతం ఆక్యుపెన్సీకి ఫిబ్రవరి 1నుండి అనుమతులు ఇచ్చింది.
హౌస్‌ఫుల్‌కు అనుమతి ఇవ్వడంతో థియేటర్లకు పూర్వ వైభవం రానుంది. అయితే ప్రేక్షకులను వంద శాతం అనుమతిచ్చినా కరోనా నిబంధనలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్లు, టెంపరేచర్ చెకింగ్‌లు, షో టైమింగ్స్, బుకింగ్స్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే సినిమా థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీ పెంచుకోవాలని సూచించింది. ఈ ఉత్తర్వులతో హర్షం వ్యక్తం చేసిన థియేటర్
యాజమాన్యాలు కేంద్రం మార్గదర్శకాలను అనుసరిస్తూ హౌస్‌ఫుల్ ఆక్యుపెన్సీకి సంసిద్దయ్యాయి. ఏపీలోని థియేటర్ యాజమాన్యాలు ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని రేపటి నుండి అనగా 11వ తేదీ నుండి పూర్తిస్థాయిలో టికెట్ల విక్రయానికి సిద్ధమయ్యారు.