ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 27, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : రవి రాజ్ వర్మ, ఇంద్రజ, అజిత్ రాధారం, ఐశ్వర్య ఉల్లింగల తదితరులు
దర్శకత్వం : హేమంత్ కృష్ణ
నిర్మాత : నవీన్ యాట
సినిమాటోగ్రఫీ : మురళీ వై కృష్ణ
సంగీతం : ఆనంద్ మంత్ర
ఎడిటర్ : రాఘవేంద్ర వర్మ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో లేటెస్ట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన కథా సుధా కొత్త ఎపిసోడే “మేమిద్దరం”. సీనియర్ నటి ఇంద్రజ కీలక పాత్రలో నటించిన ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఒక పెద్ద బిజినెస్ టైకాన్ జీకే (రవి రాజ్ వర్మ) కొడుకు చంద్రహాస్ (అజిత్ రాధారం) కి తనకి నచ్చిన సంబంధమే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. కానీ ఈ బిజినెస్ లు బిజీ లైఫ్ కాకుండా సింపుల్ గా అందరిలో ఛిల్ గా ఉండాలనుకునే మైండ్ సెట్ ఉన్న చందు మాత్రం ముందు తన నాన్నకి పెళ్లి చేసుకుని తన పెళ్లి కోసం ఆలోచించమంటాడు. ఇప్పటికే మేఘమాల (ఐశ్వర్య ఉల్లింగల) తో ప్రేమలో ఉన్న చందు తన నాన్న పెళ్లయ్యాక తన లవ్ మేటర్ చెప్పాలని చూస్తాడు. ఈ క్రమంలో జీకే తన పాత స్నేహితురాలు అలాగే ప్రేమించిన అమ్మాయి రమణి (ఇంద్రజ)ని కలిసి పెళ్లి ప్రపోజల్ పెడతాడు. ఇక ఇక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది? స్వతంత్రంగా తన కూతురుతో బతికే రమణి ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అసలు జీకే ఎందుకు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు? చివరికి నస్టపోయింది ఎవరు అనేది తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ చూడాలి.
ప్లస్ పాయింట్స్:
కథా సుధ నుంచి వచ్చిన ఈ ఎపిసోడ్ లో కథనం ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా సీరియల్ తరహా డ్రామా లాంటివి కోరుకునేవారికి ఈ అరగంట ఎపిసోడ్ లోనే కావాల్సినంత ఆసక్తి ఎదురవుతుంది. లైన్ ఈ మధ్య కాలంలో కనిపించిందే అయినప్పటికీ చివరికి ఏమవుతుంది? ఎలాంటి ముగింపు వస్తుంది అనే అంశాలు చూసే ఆడియెన్స్ లో మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తాయి.
అలాగే ఇంద్రజపై ఎమోషనల్ ట్విస్ట్ ఆలాగే రవి రాజ్ వర్మపై ట్విస్ట్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఇక వీరు నటన పరంగా కూడా చాలా బాగా చేశారు. మరోసారి నెగిటివ్ రోల్ లో రవి రాజ్ వర్మ సాలిడ్ పెర్ఫామెన్స్ చేశారు. అలాగే ఇంద్రజ తన పాత్రకి బాగా సూట్ అయ్యి రమణిగా పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక లవర్స్ గా యువ నటీనటులు అజిత్, ఐశ్వర్యలు నడుమ మంచి కెమిస్ట్రీ కనిపించింది.
మైనస్ పాయింట్స్:
ఈ ఎపిసోడ్ కథనం కొంచెం ముందుకు వెళ్లేసరికి ఆ మధ్య వచ్చిన తమిళ ఆంథాలజీ చిత్రం హాట్ స్పాట్ లో ఒక ఎపిసోడ్ లైన్ అలాగే శ్రీవిష్ణు సామజవరగమన సినిమాలలో కనిపించిన ఒక సున్నితమైన లైన్ ఇందులో కూడా కనిపిస్తుంది.
ప్రేమించిన అమ్మాయి చెల్లెలు అవ్వాల్సి వస్తే ఎలా ఉంటుంది అనే లైన్ ఇపుడు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ కొంచెం కొత్తదనం మిస్సయ్యింది. అలాగే ఇదే అంశం అందరికీ క్లిక్ కాకపోవచ్చు. లీడ్ జంటకి తమ తల్లిదండ్రుల గతం కోసం తెలినప్పుడు ఓకే కానీ తెలిసిన తర్వాత మళ్ళీ వారిపై చూపించే సన్నివేశాలు వారిద్దరి తల్లి, తండ్రులు తీసుకున్న నిర్ణయాలు లాంటివి సమాజం దృష్ట్యా చూస్తే తేలిగ్గా తీసుకునేలా అనిపించవు.
ఎంత కాదు అనుకున్నప్పటికీ లీడ్ జంట పెద్దల గతాన్ని మాత్రం ఎవరూ మార్చలేరు కదా? సో ఆ రకంగా చూసుకున్నా వీరి నడుమ లవ్ స్టోరీ ఒకింత ఎబ్బెట్టుగా అనిపించే ఫీల్ మాత్రం మిగిలిపోతుంది. సో ఇది అందరికీ నచ్చకపోవచ్చు.
సాంకేతిక వర్గం:
ఇక లఘు చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం నుంచి కెమెరా వర్క్, ఎడిటింగ్ అన్ని విభాగాల పనితీరు బాగుంది. ఇక దర్శకుడు హేమంత్ కృష్ణ వర్క్ విషయానికి వస్తే.. ఎంచుకున్న సున్నితమైన లైన్ ని ఇంప్రెసివ్ కథనంతో నడిపించారు. మంచి డ్రామా అండ్ ఎమోషన్స్ తో తీశారు కానీ లోలోపల డెప్త్ మాత్రం అందరికీ అంతలా కనెక్ట్ కాకపోవచ్చు. తన వర్క్ పరంగా మాత్రం సిన్సియర్ అటెంప్ట్ అందించారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే “మేమిద్దరం” అనే ఈ లఘు చిత్రం ఈటీవీ విన్ లో కొంతమేర బాగానే అనిపిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు నడిపిన కథనం బాగుంది. ఫ్యామిలీతో కూర్చొని ఒక ఇంట్రెస్టింగ్ డ్రమాటిక్ ఎపిసోడ్ చూడాలి అనుకుంటే ఇది బాగానే ఉంటుంది కానీ చివరికి మాత్రం అందరినీ ఈ ఎపిసోడ్ పూర్తిగా శాటిస్ఫై చేయలేకపోవచ్చు. బయటకి చెప్పుకోలేకపోయినా అంతర్మధనంగా ఒక ప్రశ్న మాత్రం ప్రశ్న గానే మిగిలిపోతుంది. సో తక్కువ అంచనాలు పెట్టుకుని ట్రై చెయ్యండి.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team