హాలీవుడ్ మరియు బాలీవుడ్లో చిన్న పెద్ద హీరో అనే భేదం లేకుండా ఒకరి సినిమాల్లో ఒకరు అతిధి పాత్రలు చేస్తుంటారు. అవి ఆ సినిమా ప్రమోషన్స్ కి కూడా చాలా ఉపయోగపడతాయి మరియు సినిమాకి క్రేజ్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఈ హవా టాలీవుడ్లో కూడా ఊపందుకుంటోంది. గతంలో వెంకీ నటించిన ‘చింతకాయల రవి’ సినిమాలో అతిధిగా ఎన్.టి.ఆర్ కనిపించారు. రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాలో మెగాస్టార్ అతిధి పాత్రలో కనిపించారు. ఇలా అప్పడప్పుడు కనిపించే ఈ పాత్రలు ఇప్పుడు బాగా ఊపందుకున్నాయి.
రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘ఎవడు’ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ ముఖ్యమైన అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. రానా హీరోగా ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో వెంకటేష్ తళుక్కుమని మెరవనున్నారు. రవితేజ హీరోగా చేస్తున్న ‘సారొచ్చారు’ సినిమాలో నారా వారి అబ్బాయి నారా రోహిత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే రవితేజ పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా వస్తున్న ‘రోమియో’ సినిమాలో కనిపించి కనువిందు చేయనున్నారు. హీరోలకి నేను ఏమీ తక్కువ కానంటూ సిద్దార్థ్ – సమంత జంటగా నటిస్తున్న సినిమాలో కేరళ కుట్టి నిత్యా మీనన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.
ఒక వైపు మల్టీ స్టారర్ సినిమాలు ఒక్కొక్కటిగా మొదలవుతుండడం మరియు ఇలా ఒకరి సినిమాల్లో మరో హీరో అతిధి పాత్రల్లో కనిపించడం లాంటి మార్పులు చూస్తుంటే టాలీవుడ్ కి మంచి రోజులు రాబోతున్నట్లుగా ఉంది.