తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవలే కరోనాకు గురైన సంగతి తెలిసిందే. ఈ నెల 27వ తేదీన తనకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతిని చెప్పారు సూర్య. దీంతో ఆయన వెంటనే చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. సూర్యకు కోవిడ్ పాజిటివ్ అని తెలియడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సూర్య త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు నిర్వహించారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం సూర్య ఈరోజే డిశ్చార్జ్ అయ్యారు.
ఈ విషయాన్ని ఆయన సోదరుడు కార్తి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అన్నయ్య ఆరోగ్యంగా ఉన్నారని, ఇంటికి తిరిగొచ్చారని, ఇంకొన్ని రోజులు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ తీసుకుంటారని చెప్పుకొచ్చారు. సూర్య కొలుకున్నారన్న విషయం తెలియడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా, వెట్రిమారన్, సూరుతై శివ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆయన్నుండి రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.