సోమవారం రాత్రి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన’ శ్రీమన్నారాయణ’ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి సినీ పరిశ్రమలోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ ఇప్పటి వరకూ నా కెరీర్లో చాలా రకాల పాత్రలు పోషించాను, కానీ ఈ సినిమాలో ఒక ప్రేత్యేక పాత్రను పోషించాను. దైర్య సాహసాలు మరియు సమాజం పట్ల నిజాయితీ తో నడుచుకునే ఒక మనిషి చుట్టూ ఈ చిత్ర కథ అల్లుకొంది. ఈ చిత్ర కథను ప్రస్తుతం సమాజంలో ఒక సామాన్య మానవుడికి జరుగుతున్న అన్యాయాలను గురించి దర్శకుడు తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ఈ చిత్రం యూత్ ని బాగా ప్రభావితం చేస్తుంది మరియు ఇలాంటి ఒక భాద్యతాయుతమైన పాత్రను పోషించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటి వరకూ నేను చేసిన కొత్త రకమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా నేను ఈ చిత్రంలో కనిపిస్తాను అని’ ఆయన అన్నారు.
బాలకృష్ణ సరసన పార్వతి మెల్టన్ మరియు ఇషాచావ్లా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. రవి కుమార్ చావాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మించారు. ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ’ ఈ చిత్రం మొత్తం చిత్రీకరణ 84 రోజుల్లో పూర్తి చేశాము మరియు సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ నటన చాలా అద్భుతంగా ఉంటుందని’ ఆయన అన్నారు.
ఈ వేడుకకి హాజరైన బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ 2010లో సింహావతారం చూశాం, 2011లో రామావతారం చూశాము మరియు ఈ సంవత్సరంలో శ్రీమన్నారాయణుడి అవతారంలో బాలకృష్ణని చూస్తాము’ ఆయన అన్నారు. బాలకృష్ణతో కలిసి ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా హాజరయిన ఈ వేడుకకి రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా హాజరయ్యారు.