రోజులు గడిచేకొద్దీ దిగ్గజ గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదటపడుతోంది. మరోవైపు, కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ తరువాత ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రి కూడా ఆసుపత్రిలో చేరిన తరువాత బాగా కోలుకుంటున్నారు. నిన్న, ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పి చరణ్ తన తండ్రి మరియు తల్లి ఆరోగ్య స్థితిగతులను వివరిస్తూ మరో వీడియోను విడుదల చేసారు.
బాలు వేగంగా కోలుకుంటున్నారని, తన వైద్యులను గుర్తిస్తున్నారని.. తను బాగానే ఉన్నానని చూపించడానికి బ్రొటనవేళ్లు కూడా కదిలిస్తున్నారని చరణ్ చెప్పారు. తన తల్లి మంగళవారం లేదా బుధవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని కూడా చరణ్ వెల్లడించారు.
ఇక తనకు కరోనా సోకినట్లు బాలసుబ్రమణ్యం వీడియో చేసి స్వయంగా తెలియజేశారు. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో చెన్నైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ నందు బాలసుబ్రమణ్యం చేరడం జరిగింది. అక్కడ ఆయన కోవిడ్ టెస్టులు నిర్వహించగా, పాజిటివ్ అని తేలడంతో ఆయన్ని ఐసోలేషన్ వార్డ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.