సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా

సమీక్ష : మేఘాలు చెప్పిన ప్రేమకథ – అంతగా ఆకట్టుకోని రొమాంటిక్ డ్రామా

Published on Aug 22, 2025 4:26 PM IST

meghalu-cheppina-prema-kath

విడుదల తేదీ : ఆగస్టు 22, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్, రాధిక శరత్‌కుమార్, ప్రిన్స్ రామ వర్మ, సుమన్, ఆమని, రాజా చెంబోలు తదితరులు
దర్శకుడు : విపిన్
నిర్మాతలు : ఉమాదేవి కోట
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ : మోహన కృష్ణ
ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

యంగ్ హీరో నరేష్ అగస్త్య తాజాగా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ అనే రొమాంటిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రబియా ఖాతూన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
వరుణ్(నరేష్ అగస్త్య) ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త(సుమన్) కొడుకు. తన బిజినెస్‌ను కొడుకు చూసుకోవాలని ఆ తండ్రి కోరుకుంటాడు. కానీ, వరుణ్ సంగీతంపై మక్కువతో మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఆశిస్తాడు. తన తండ్రి కోరికను కాదని తన లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్న వరుణ్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మేఘ(రబియా ఖాతూన్)తో పరిచయం ఏర్పడుతుంది. వారి పరిచయం ఘాడ బంధంలోకి మారుతుంది. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేది ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

‘మెఘాలు చెప్పిన ప్రేమకథ’ చిత్రాన్ని చాలా నిజాయితీగా చిత్రీకరించారు. సమాజం తనపై పెట్టుకున్న అంచనాలను కాదని తనకు నచ్చిన పని కోసం పరితపించే హీరో కథను చాలా మంది కనెక్ట్ అవుతారు. ఈ తరహా కాన్సెప్ట్‌పై గతంలో చాలా సినిమాలు వచ్చినా.. ఈ చిత్రంలో చూపిన నిజాయితీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో-తండ్రి మధ్య వచ్చే ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ చక్కగా చూపెట్టారు.

రచయితగా విపిన్ ప్రతిభను మెచ్చుకోవాలి. ఆయన రాసిన కొన్ని డైలాగులు అద్భుతంగా ఉండటంతో పాటు హృదయాలను హత్తుకుంటాయి. ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్‌లోనూ కొన్ని చక్కటి సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. నరేష్ అగస్త్య ఇలాంటి పాత్రలు గతంలో చేసినా కూడా ఆయన నుంచి వచ్చే ఔట్‌పుట్ ఆకట్టుకుంటుంది. అతనిలోని ప్రతిభను ఇంకా పూర్తిగా వినియోగించుకోలేకపోయారు అని ప్రేక్షకులకు అనిపిస్తుంది.

రబియా ఖాతూన్ తన పాత్రలో అద్భుతంగా నటించింది. ఆమె పాత్రను రాసుకున్న తీరు చక్కగా ఉండటంతో ఆమె చెలరేగిపోయింది. మేఘ అనే పాత్రలో ఒదిగిపోయిన ఆమె తన డైలాగులను తెలుగులో చెబుతూ ఆకట్టుకుంటుంది. రాధికా శరత్‌కుమార్ తనదైన ఈజ్‌తో నటించి తన పాత్రకు న్యాయం చేశారు. సంగీత దర్శకుడు ప్రిన్స్ రామ వర్మ కేమియో ఆకట్టుకుంటుంది. సుమన్, ఆమని, రాజా చెంబోలు తదితరులు తమ పాత్రల మేర మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :
కథలోని మెయిన్ ప్లాట్ బాగున్నా, ఈ చిత్ర పేస్ సినిమాకు డ్యామేజ్ చేసింది. చాలా సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో చాలా సీన్స్ ల్యాగ్ అనిపించాయి. ఈ సీన్స్‌ను ఎడిటింగ్‌లో ట్రిమ్ చేసి ఉండాల్సింది.

కాన్సెప్ట్ అందరికీ నచ్చే విధంగా ఉన్నా, దాన్ని తెరకెక్కించిన తీరు అందరినీ మెప్పించదు. కొన్ని సీన్స్ చాలా నాటకీయంగా మారడంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది.

ఇక క్లైమాక్స్‌ను కూడా హడావిడిగా ముగించారనిపిస్తుంది. చాలా సీన్స్ త్వరత్వరగా ముగించారని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. హీరోహీరోయిన్ మధ్య కాంఫ్లిక్ట్‌ను ఇంకా ముందుగానే చూపెట్టాల్సింది. అప్పుడు కథలో ఇంపాక్ట్ పెరిగేది. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో పనిచేయలేదు.

సాంకేతిక విభాగం :
ఈ సినిమా మ్యూజికల్ జర్నీగా ఉండటంతో ఇందులోని పాటలు ఆకట్టుకునేలా ఉంటాయి. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్‌ను ఈ విషయంలో అభినందించాలి. ప్రతి పాట వినసొంపుగా ఉంటుంది. మోహన కృష్ణ వాటిని తెరకెక్కించిన తీరు కూడా అద్భుతం. ప్రతి సీన్ కూడా విజువల్‌గా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

విపిన్ రచయితగా మెప్పించినా, దర్శకుడిగా కాస్త తడబడ్డాడు. ఆయన ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. క్లైమాక్స్‌ను మలిచిన తీరు, బోరింగ్ సీక్వెన్స్‌లు, మెప్పించని కామెడీ వంటి అంశాలపై ఆయన మరింత ఫోకస్ పెట్టాల్సింది. అయితే, నటీనటులలోని ప్రతిభను ఆయన బాగా వినియోగించుకున్నాడు.

తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ చక్కటి కథ ఉన్నప్పటికీ, స్లో పేస్ కారణంగా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయింది. నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ చక్కటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు. కొన్ని డైలాగులు ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేస్తాయి. అయితే, ఇందులోని సాగదీత సన్నివేశాలు, బోరింగ్ మూమెంట్స్, క్లైమాక్స్‌ను త్వరగా ముగించిన తీరు ప్రేక్షకులను మెప్పించవు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

తాజా వార్తలు