ప్రస్తుతం బిజీగా ఉన్న నటుల్లో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఇటీవలే ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఓనమాలు’ చిత్రం ఇటీవలే విడుదలైంది మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కి ఆగష్టు 9న విడుదల కానున్న ‘జులాయి’ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆ చిత్రాలు కాకుండా ఆయన హీరోగా నటించిన చిన్న బడ్జెట్ చిత్రాలు ఈ సంవత్సరంలో విడుదలకు సిద్దమవుతున్నాయి. అందులో భాగంగా ఆయన నటిస్తున్న ‘నూతిలో కప్పలు’ చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రానికి ‘ పైకి రావు రానివ్వరు’ అనేది ఉపశీర్షిక. వినయ్ మరియు పూనటి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ చిత్రానికి చంటి జ్ఞానమని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం 70% చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
‘ ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ సరికొత్త లుక్ తో కనిపిస్తాడు. తను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడో ఈ సినిమాలో అలా కనిపిస్తాడు. ఈ నెల చివర్లో ఈ చిత్ర చివరి షెడ్యూల్ మొదలు కానుందని’ ఈ చిత్ర దర్శకుడు చంటి అన్నారు. పరి సింగ్, దీక్ష పనత్, భరత్ భూషణ్, రామ్ తేజ్, విజయ్ మరియు మనోజ్ నందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.