యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు దగ్గుబాటి రానా లు ప్రధాన పాత్రదారులుగా ‘బాహుబలి’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలలుగా రామోజీ ఫిల్మ్ సిటీ లో యుద్ద క్రమంలో సాగే సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చాయి.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఈ రోజు రాత్రి చిత్రీకరించనున్నారు. ‘చాలా రోజుల నుంచి ఎండలో సన్నివేశాలను చిత్రీకరించాము. ఈ రోజు రాత్రి, చల్లటి వాతావరణంలో షూటింగ్ జరుపుకోనున్నామ’ని ఆ చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
దక్షిణ భారత దేశంలోని అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సబు సైరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా, సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
2015 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు.