భక్తిరస సెంటిమెంట్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న నాగ్

భక్తిరస సెంటిమెంట్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న నాగ్

Published on Mar 3, 2013 12:52 PM IST

Nagarjuna_Latest
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 27 సంవత్సరాలు పూర్తి కావస్తున్న కింగ్ నాగార్జున ఒకే తరహా ప్రేక్షకులకు పరిమితమవ్వకుండా మాస్, క్లాస్, భక్తి ఇలా అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించారు. ‘శివ’, ‘గీతాంజలి’ సినిమాలు ఆయన కెరీర్ కి టర్నింగ్ పాయింట్స్ అయితే కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చేసిన ‘అన్నమయ్య’ సినిమా ఆయనకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. అలాగే ఇమేజ్ అనే చట్రాన్ని పక్కన పెట్టి అన్ని రకాల పాత్రలు చేసిన అతి తక్కువ మందిలో నాగార్జున ఒకరు. ‘శ్రీ రామదాసు’, ‘శిరిడి సాయి’ లాంటి భక్తిరస సినిమాల తర్వాత ఇటీవలే ‘ఢమరుకం’ సినిమాలో శివ భక్తునిగా కనిపించిన నాగ్ త్వరలో శివుడి పాత్రలో కనిపించనున్నాడు.

ప్రస్తుతం జె.కె భారవి డైరెక్ట్ చేస్తున్న ‘ఆది శంకర’ సినిమాలో నాగార్జున శివుని అవతారమైన చండాలుడు పాత్రలో కనిపించనున్నాడు. ఆది శంకరాచార్య భక్తి శ్రద్దలని పరీక్షించడానికి చండాలుడుగా వచ్చి అతని భక్తికి ముగ్దుడై వరాలు ఇస్తాడు. ఈ సినిమాలో ఇదే కీలకమైన ఎపిసోడ్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సీన్స్ కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సారధి స్టుడియోలో చిత్రీకరించారు.

కౌశిక్ ఆది శంకరాచార్యగా నటిస్తున్న ఈ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ అందిచగా, డా. మోహన్ బాబు, శ్రీ హరి కీలక పాత్రలు పోషించారు. నాగ్ శ్రీవత్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వరలోనే విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు