షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టినా మహేష్ రెడీ


సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రాన్ని ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా అధికారికంగా ప్రకటించబడగానే లాక్ డౌన్ విధించబడింది. దీంతో ఈపాటికే మొదలుకావాల్సిన చిత్రీకరణ మొదలుకాలేదు. ఇక లాక్ డౌన్ సడలింపులు తర్వాత స్టార్ట్ చేయాలని చూసినా వీసా సమస్యల కారణంగా వాయిదాపడుతూ వస్తోంది. కథ ప్రకారం సినిమాలోని కొంత భాగం అమెరికాలో ఉండాలి. అందుకే ముందు అమెరికా షెడ్యూల్ ముగిస్తే హైదరాబాద్లో షూటింగ్ చేయవచ్చని పరశురామ్ ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఒకవేళ వీసాలు వచ్చినా కరోనా ప్రభావం ఇంకా కొంత ఉంది కాబట్టి విదేశాలకు వెళ్లి షూటింగ్ చేయడానికి మహేష్ ఒప్పుకుంటారో ఒప్పుకోరో అనే అనుమానం ఉండేది. కానీ మహేష్ తాజాగా కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఆయనకు ఫారిన్లో షూటింగ్ జరపడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని, సెట్స్ మీదకు రావడానికి ఆయన ఎప్పుడో సిద్ధమయ్యారని స్పష్టంగా తెలిసొచ్చింది. సో.. ఒక్కసారి వీసాలు అప్రూవ్ అయితే అమెరికాలో ‘సర్కారు వారి పాట’ షురూ అవుతుందన్నమాట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించనుంది.

Exit mobile version