మాధవన్ నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. ఎలాంటి పాత్రకైనా ప్రానమ్ పోయగల నటుడు ఆయన. ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవన్ ఇటీవల కాలంలో నటుడిగా కొత్త టర్న్ తీసుకున్నారు. ఆసక్తికరమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులుల్ని మెప్పిస్తున్నారు. మాధవన్ కు కేవలం నటన మీదే కాదు సినిమాకు సంబంధించిన పలు విభాగాల్లో మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన్ను సినిమా పుస్తకం అంటుంటారు చాలామంది సన్నిహితులు.
సినిమా రంగానికి, కళా రంగానికి నటుడిగా ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ డివై పాటిల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆయన డాక్టర్ ఆఫ్ లెటర్స్ పేరుతో డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఎడ్యుకేషన్ సొసైటీ 9వ వార్షికోత్సవం వేడుకల్లో ఈ డాక్టరేట్ అందుకున్నారు మాధవన్. ఇంత పెద్ద గౌరవం అందడంతో మాధవన్ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ గౌరవాన్ని చాలా గొప్పగా భావిస్తున్నాను. ఈ ప్రోత్సాహమే ఇంకొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రి’ అనే సినిమా చేస్తున్నారు మాధవన్. దీన్ని దర్శకుడు అనంత మహదేవన్‌తో కలిసి ఆయనే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నారాయణన్ పాత్రలో మాధవన్ నటిస్తున్నారు.