సౌత్ ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘కాదల్’. చాలా విరామం తర్వాత లక్ష్మీ మంచు ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. గౌతమ్ (సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు) మరియు తులసి (రాధిక చిన్న కూతురు) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ మంచు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఒక చేపలు పట్టుకొని బతికే గ్రామం నేపధ్యంలో తెరకెక్కుతున్న అందమైన ప్రేమకథ. ‘మణిరత్నం గారి సినిమాలో నా చివరి షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటున్నాను. ప్రస్తుతం నేను కన్న కలలో జీవిస్తున్నాను. కలలు కనడం అసలు ఆపను అని’ లక్ష్మీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ తమిళనాడు టుటికోరియన్ జిల్లాలోని తిరుచెందూర్ అనే చిన్న టౌన్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.