తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన గత సినిమాలు ‘ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఊపిరి, ఖైదీ’ సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం కార్తీ ‘సుల్తాన్’ సినిమా చేస్తున్నారు. ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు కార్తీ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం ఇదే. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా టీజర్ విడుదలైంది. తమిళంతో పాటు తెలుగులో కూడ విడుదలైంది.
ఫుల్ లెంగ్త్ యాక్షన్ కంటెంట్ కలిగి ఉన్న టీజర్ బాగానే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో యాక్షన్ మాత్రమే కాదని ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్ అన్నీ ఉంటాయని నిజాయితీతో ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇదని చెప్పుకొచ్చారు కార్తీ. ఇక ఇందులో కార్తీకి జోడీగా రష్మిక మందన్న నటించింది. ఇదే తమిళంలో ఆమెకు మొదటి ప్రాజెక్ట్. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది కాకుండా కార్తీ మణిరత్నం భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘పొన్నియన్ సెల్వన్’లో కూడ నటిస్తున్నారు.