కాలానుగుణంగా టాలీవుడ్ కొత్తరకమైన ట్రెండ్స్ ని అనుసరిస్తోంది. ఒకే సమయయంలో ఒకే కాన్సెప్ట్ మీద లేక ఒకే థీం మీద చాలా సినిమాలు వస్తున్నాయి. ఉదాహరణకి ఒక సమయంలో పూర్తి పోలీస్ ప్రాదాన్యం ఉన్నా సినిమాలు వచ్చాయి, ఆతర్వాత కొంతకాలం రాజకీయ నేపధ్యం ఉన్న సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో జర్నలిస్ట్ పాత్రల మీద కథలు రాసుకొని సినిమాలు తీస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో జర్నలిస్ట్ నేపధ్యంలో రానున్న చిత్రాల పై ఓ కన్నేద్దాం. ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నందమూరి బాలకృష్ణ జర్నలిస్ట్ పాత్రని పోషించారు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక టీవీ జర్నలిస్ట్ గా కనిపించనున్నారు. అలాగే రానా హీరోగా రానున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో నయనతార జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కాజల్ జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ పెద్ద హీరోల భారీ చిత్రాలన్నీ జర్నలిస్ట్ చుట్టూ అల్లుకున్న కథలతో తెరకెక్కుతున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా జర్నలిజం నేపధ్యంలో రానున్నాయి. ఈ సందర్భంగా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఏమిటంటే ప్రస్తుతం టాలీవుడ్ జర్నలిస్ట్ కథలపై ఆసక్తి చూపుతోంది.