మెగాస్టార్ చిరంజీవి, అందాల తార శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ తెరకెక్కించి ప్రభంజనం సృష్టించారు. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ చిత్రం విడుదలై 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న మళ్లీ విడుదల చేయబోతున్నారు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ-రిలీజ్ సందర్భంగా చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు నాటి విషయాలను పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్ అయి అప్పుడే 35 ఏళ్లు అవుతోందా? అని అనిపిస్తోంది. శ్రీదేవితో అంతకు ముందు ఓ రెండు చిత్రాల్లో నటించాను. కానీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఫస్ట్ సినిమా అన్నంతగా జనాలు ఫిక్స్ అయిపోయారు. సినిమా రిజల్ట్‌ను పట్టి మనిషి టాలెంట్‌ను అంచనా వేయొద్దు. ఓ టెక్నీషియన్‌గా రాఘవేంద్రరావు గారు ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. ఈ మూవీ కోసం 27 మంది రైటర్స్ పని చేశారు. ఇళయారాజా గారు ఈ సినిమా కోసం ప్రతీ పాట మూడు, నాలుగు గంటల్లో కంపోజ్ చేసేశారు. ఈ రీ-రిలీజ్‌లో శ్రీదేవీ గారిని చాలా మిస్ అవుతున్నాం. ఈ రీ-రిలీజ్ ఆమెకు అంకితం. విన్సెంట్ గారు ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్‌గా మలిచారు. ఆ టైంలోనే ఆయన వండర్స్ చేశారు. ఎంతో శక్తి ఉన్న ఆ రింగుని చేప మింగిన తరువాత ఏం జరిగింది? అనే పాయింట్‌ను అప్పుడే ఎండ్ కార్డులో వేసి ఉంటే సీక్వెల్ ఎప్పుడో వచ్చేది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తే అందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించాలని ఉంది. ఇప్పటి తరం ఈ రీ-రిలీజ్‌ను చూడండి. మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్లి సినిమాను చూడండి అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
అశ్వనీదత్ మాట్లాడుతూ.. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ గురించి ఎప్పుడు తలుచుకున్నా కంట్లోంచి ఆనంద భాష్పాలు వస్తుంటాయి. చిరంజీవి గారికి, రాఘవేంద్రరావు గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. చిరంజీవి గారు గొప్ప వ్యక్తి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కోసం ఆయన తీసుకున్న ఎన్నో నిర్ణయాలు సినిమాకు దోహదపడ్డాయ’ని అన్నారు.
కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘సినిమాలో హీరోయిన్ ఇంద్రలోకం నుంచి భూలోకం వచ్చారు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ అంటే మేం మళ్లీ ఇంద్రలోకంకి వెళ్తున్నట్టుగా అనిపించింది. నేను ఫ్లాపుల్లో ఉన్నా కూడా నన్ను నమ్మి చిరంజీవి గారు, దత్ గారు అవకాశం ఇచ్చారు. వారికి ఎప్పుడూ రుణ పడి ఉంటాను. సినిమా పరిశ్రమలో ఇళయారాజా గారు కొత్త సౌండింగ్‌ను తీసుకు వచ్చారు. ‘అందాలలో అహో మహాదయం’ పాట నాకు ఎప్పుడూ కళ్లలోనే మెదులుతుంది. ఆ పాటలో ఒక మానవుడ్ని, ఒక దేవతను చూపించారు. ఇళయారాజా గారు తన మ్యూజిక్‌తో అద్భుతం చేశారు. ఇలాంటి చిత్రాన్ని మళ్లీ తీయలేం.. ఇలాంటి హిట్‌ను మళ్లీ కొట్టలేం. భయంకరమైన తుఫాన్ వచ్చినా, థియేటర్లన్నీ నీళ్లతో నిండినా కూడా సినిమాను చూసి బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఈ చిత్రం కంటే ఎన్నో సినిమాలు ఎన్నో రెట్లు కలెక్షన్స్ సాధించొచ్చు. కానీ తుఫాను రావాలి.. అలాంటి పరిస్థితుల్లో సినిమా వచ్చి హిట్టు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. మళ్లీ నేను ఈ మూవీని ఫ్రెష్‌గా మే 9న చూస్తాను. ఆ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ను మళ్లీ ఆస్వాధిస్తాను’ అని అన్నారు.
వీడియో బైట్ ద్వారా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అనేది ఓ డ్రీమ్ టీం. చిరంజీవి గారు, శ్రీదేవీ గారు, అశ్వనీదత్ గారు, రాఘవేంద్రరావు గారు, ఇళయారా గారు, విన్సెంట్ గారు, యండమూరి గారు ఇలా మహామహులంతా కలిసి ఈ మూవీని చేశారు. మళ్లీ ఇలాంటి ఓ టీం కలిసి ఇలాంటి ఓ క్లాసిక్ మూవీని తీయలేదు. ఇకపై తీయలేరు కూడా. మా జనరేషన్‌కు డ్రీమ్ టీం అంటే ఇదే. ఇక ఈ చిత్రంలో చివర్లో చూపించిన రింగ్ ఏమైంది? ఆ చేప ఎక్కడుంది? ఇలాంటి ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి. ఇది రిక్వెస్ట్ కాదు.. ఇది మా డిమాండ్’ అని అన్నారు.