మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’ టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. దర్శకుడు కొరటాల శివ టీజర్లో ఉండాల్సిన అన్ని అంశాలను ఉంచి అభిమానులను, ప్రేక్షకులను మెప్పించారు. చిరంజీవి స్టార్ డమ్ స్థాయిని అందుకునేలా ఎలివేషన్ ఉందని, డైలాగ్స్ గొప్పగా ఉన్నాయని, వింటేజ్ చిరు కనిపించారని చాలామంది చాలా రకాలుగా టీజర్ మీద, దర్శకుడి మీద పొగడ్తలు కురిపిస్తున్నారు. టీజర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్లో ఉంది. అయితే టీజర్ ఆసాంతం చూశాక విజువల్ వర్క్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.
టీజర్లోని అన్ని విషయాలకంటే డీవోపీ తిరు సినిమాటోగ్రఫీ అమితంగా ఆకర్షిస్తోంది. టీజర్ మొత్తం రెడ్ టింట్ నింపేసి పవర్ఫుల్ అప్పీల్ తీసుకొచ్చారు తీరు. ప్రధానంగా కొన్ని షాట్లు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాయి. సూర్యగ్రహణం షాట్, పోరాట దృశ్యాలు కళ్లప్పగించి చసేలా చేశాయి. టీజర్లో ఎక్కువగా కనబడే రెడ్ కలర్ సినిమా ఎలా ఉండబోతుంది, థీమ్ ఏమిటో ఒక అంచనా క్రియేట్ చేశాయి. నిముషం ఏడు సెకన్ల నిడివి ఉన్న టీజర్లోనే ఇన్ని బ్రహ్మాండమైన షాట్స్ ఉంటే ఇక పూర్తి సినిమాలో ఇలాంటివి ఎన్ని క్రియేట్ చేశారో డీవోపీ తిరు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.