ఇంటర్వ్యూ : దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ – ‘కన్నప్ప’గా విష్ణు మంచు వంద శాతం న్యాయం చేశారు!

ఇంటర్వ్యూ : దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ – ‘కన్నప్ప’గా విష్ణు మంచు వంద శాతం న్యాయం చేశారు!

Published on Jun 24, 2025 9:00 PM IST

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం.మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప రూపొందింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను కూడా ఉవ్వెత్తున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మీడియాతో ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు.

– ‘మహాభారతం’ సీరియల్‌ చాలా పెద్దది. అన్ని ఎపిసోడ్స్‌కి నేను దర్శకత్వం వహించలేదు. మరి కొంత మంది దర్శకులు కూడా ఉన్నారు. విష్ణు టీం నుంచి నాకు ఓ సారి కాల్ వచ్చింది. నాతో పాటు ఇంకా కొంత మంది కూడా ఆ సీరియల్‌కు డైరెక్ట్ చేశారు అని చెప్పాను. ఆ తరువాత చాలా రోజుల వరకు కాల్స్ ఏమీ రాలేదు. అనూప్ సింగ్ ఠాకూర్ ఆచారి అమెరికా యాత్ర సినిమాను చేశారు. ఆ టైంలో నా గురించి అనూప్, విష్ణుకి చర్చ జరిగింది. అలా నన్ను మళ్లీ అప్రోచ్ అయ్యారు.

– విష్ణు నన్ను హైదరాబాద్‌కు రమ్మన్నారు. ఇక్కడకు వచ్చినప్పుడు ఓ మూడు, నాలుగు గంటలు చర్చించుకున్నాం. అప్పటి వరకు నాకు కన్నప్ప గురించి అంత పెద్దగా తెలీదు. విష్ణు ఈ కథ గురించి చెప్పిన తరువాత చాలా రీసెర్చ్ చేశాను. మళ్లీ మోహన్ బాబు గారు మరోసారి పిలిచారు. మహాభారతం సీరియల్ గురించి నాతో గంట మాట్లాడారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చర్చించుకున్నాం. అలా నన్ను ఈ చిత్రానికి ఫైనల్ చేశారు.

– ‘కన్నప్ప’ కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అందరూ ఎంతో అంకిత భావంతో సెట్స్ మీద వర్క్ చేశారు. వారి వల్లే నా పని చాలా ఈజీగా మారిపోయింది. అక్షయ్ సర్, మోహన్‌లాల్ సర్, ప్రభాస్ సర్, మోహన్ బాబు గారు, విష్ణు గారు, బ్రహ్మానందం గారు ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. మోహన్ బాబు గారు ఈ వయసులోనూ ఎంతో ప్యాషనేట్‌గా పని చేశారు. నిర్మాతగా ఒకలా ఉండేవారు.. నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవారు.

– ‘కన్నప్ప’ మీద ఇంత వరకు వచ్చిన చిత్రాలన్నీ చేశాను. కన్నడ, తెలుగు, హిందీలో వచ్చిన చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకున్నాను. విష్ణు గారు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. చివరి గంట అద్భుతంగా ఉంటుంది.

– ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవ్వరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశచెందరు. ఇప్పటి వరకు చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.

– కన్నప్ప అనేది మైథలాజి కాదు.. ఇది మన హిస్టరీ. ఓ ఘటన జరిగితే.. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. కన్నప్ప అనే వాడు ఉండేవాడు. కానీ ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు