ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరణ్ జంటగా నటించిన ‘బైసన్’ (Bison) చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పా. రంజిత్ సమర్పణలో, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జగదంబే ఫిల్మ్స్ బ్యానర్‌పై అక్టోబర్ 24న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా, చిత్రం బృందం మంగళవారం (అక్టోబర్ 21) నాడు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది.
హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ, “నాన్న (విక్రమ్) కష్టం, ప్రయోగాల గురించి ఇక్కడ షాపు ఓనర్ చెప్పిన మాటలు నన్ను కదిలించాయి. ఆయనలాగే అందరి ప్రేమను సంపాదించడానికి నేను చాలా కష్టపడతాను. ‘బైసన్’ కోసం మూడేళ్లు కష్టపడ్డాను. దర్శకుడు మారి సెల్వరాజ్ గారు తన జీవితానుభవాల నుంచి కథలు రాసుకుంటారు. ఈ చిత్రం అర్జున అవార్డు గ్రహీత మణతి గణేషన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో నటించడానికి నేను కబడ్డీ నేర్చుకోవాల్సి వచ్చింది. తమిళంలో మంచి ఆదరణ దక్కింది. తెలుగు ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుంది. అక్టోబర్ 24న అందరూ మా సినిమాను చూడండి” అని కోరారు.
అనుపమ పరమేశ్వరణ్ మాట్లాడుతూ, “మారి సెల్వరాజ్ గారి దర్శకత్వంలో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. ఈ చిత్రంలో నటించడం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలనే డిమాండ్ బలంగా రావడంతో అక్టోబర్ 24న మీ ముందుకు వస్తున్నాం. ధృవ్‌కి ఉన్న ప్యాషన్, ఆయన కష్టం తెరపై కనిపిస్తుంది” అని తెలిపారు.
నిర్మాత వీపీ సెల్వన్ బాలాజీ మాట్లాడుతూ, లింగుస్వామి, తన సోదరుడు చంద్రబోస్ గారి సలహా మేరకు ఈ గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.