మొదటి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి ఇటీవలే తన రెండవ సినిమా ‘మహాసముద్రం’ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి ఆయనకు చాలా సమయమే పట్టింది. పలువురు హీరోల వద్దకు కథను తీసుకువెళ్లిన ఆయనకు చివరకు శర్వానంద్ లాక్ అయ్యారు. డిసెంబర్లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనుకున్న తేదీకే షెడ్యూళ్లు ముగుస్తున్నాయి.
దీంతో ముందుగా చెప్పినట్టు ఆగష్టు 19వ తీదీనే సినిమా విడుదలవుతుందని ధీమాగా చెబుతున్నారు అజయ్ భూపతి. మొదటి నుండి ఆయన సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఈసారి కూడ ‘ఆర్ఎక్స్ 100’ లాంటి విజయం ఖాయమనే హింట్స్ ఇస్తున్నారు. అసాధారణమైన పాత్రలతో కూడిన ఉద్రేకభరితమైన లవ్ స్టోరీని, ఇంటెన్స్ డ్రామాను మీకు చూపించడానికి ఉత్సాహంగా ఉన్నాను. ఇలాంటి సినిమాను ఇంతకుముందెప్పుడూ మీరు అనుభవించి ఉండరు. ఖచ్చితంగా దీన్ని మీరు ప్రేమిస్తారు అంటూ గతంలోనే చెప్పిన అజయ్ భూపతి ఇప్పుడేమో చెప్పిన తేదీకే సినిమా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. దీన్నిబట్టి సినిమా మీద ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒక క్రైమ్ అండ్ లవ్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటెర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.