ఓటిటి సమీక్ష: ‘ట్రింగ్ ట్రింగ్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష: ‘ట్రింగ్ ట్రింగ్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం

Published on Apr 30, 2025 9:13 PM IST

Tring Tring Movie Review in Telugu

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఏప్రిల్ 27, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : రవి మహాదాస్యం, స్నేహల్ కామత్, దీక్షిక జాదవ్ తదితరులు.
దర్శకుడు : వేగేశ్న సతీష్
నిర్మాణం : వేగేశ్న సతీష్
సంగీతం : ఎస్ కె బాల చంద్రన్
సినిమాటోగ్రఫీ : ఎస్ కె బాల చంద్రన్
ఎడిటర్ : మధు
సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు కొనసాగిస్తున్న లఘు చిత్రాల వీక్లీ సిరీస్ లో వచ్చిన రీసెంట్ మరో లఘు చిత్రమే ‘ట్రింగ్ ట్రింగ్’. ఈ వీక్లీ సిరీస్ లో శతమానం భవతి దర్శకుడు వేగేశ్న సతీష్ నుంచి వచ్చిన మరో లఘు చిత్రం ఇది కాగా ఇదెలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఈ లఘు చిత్రం బ్యాక్ డ్రాప్ 1990ల సమయంలో సెట్ చేయబడింది. ఆ సమయంలో అప్పుడప్పుడే టెలిఫోన్ లు వాడకం మొదలైన సమయంలో తన పల్లెటూరులో మొదటి టెలిఫోన్ కనెక్షన్ ని సీతారామరాజు (రవి మహాదాస్యం) తన ఇంటికి పెట్టించుకుంటాడు. అలా పెట్టించుకున్నాక ఒకరోజు శాంతి (స్నేహల్ కామత్) అనే అమ్మాయి నుంచి రాంగ్ కాల్ వస్తుంది. ఆమె వేరే వ్యక్తికి చేయబోయి రాజుకి చేసిన ఫోన్ కాల్ వీరి ప్రేమకి ఎలా దారి తీసింది? ఆమె గొంతు, వాక్చాతుర్యం మాత్రమే విని ఇష్టపడ్డ రాజు ఆమెని నేరుగా కలిసినపుడు ఏం జరిగింది? శాంతి తన స్నేహితురాలు ప్రియ (దీక్షిక జాదవ్) తో ఏం ప్లాన్ చేసింది? చివరికి రాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేదే ఈ ఎపిసోడ్ తాలూకా సారాంశం.

ప్లస్ పాయింట్స్:

ఈ ఎపిసోడ్ లో లీడ్ నటీనటులు తమ పాత్రలకి బాగా సెట్ అయ్యారు అని చెప్పవచ్చు. మెయిన్ గా రవి మరియు స్నేహాల్ లు నాచురల్ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకున్నారు. స్నేహల్ పద్ధతైన పల్లెటూరి అమ్మాయిగా మంచి లుక్స్ తో ఆకట్టుకునేలా ఉంది అంతే కాకుండా తన డైలాగ్ డెలివరీ నటన కూడా బాగున్నాయి.

ఇంకా తన ఫ్రెండ్ పాత్రలో నటించిన దీక్షిక కూడా బాగా చేసింది. వీరితో పాటుగా మెయిన్ లీడ్ తల్లిదండ్రుల పాత్రల్లో చేసిన సీనియర్ నటులు కూడా బాగా చేశారు. అలాగే పల్లెటూరు నేపథ్యంలో కొన్ని దృశ్యాలు చూసేందుకు ఆహ్లాదంగా అనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:

ఈటీవీ విన్ లో గత రెండు ఎపిసోడ్స్ వేగేశ్న సతీష్ నుంచి మంచి ఫీల్ గుడ్ ట్రీట్ ని అందించాయి కానీ ఈ ఎపిసోడ్ మాత్రం వాటి రేంజ్ లో లేదని చెప్పక తప్పదు. కథాంశం సహా సహా కథనం కూడా చాలా సింపుల్ గా స్లోగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది.

అయితే ఈ ఎపిసోడ్ ని కొంచెం ఎంటర్టైనింగ్ టైప్ లో ప్లాన్ చేశారు కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. చాలా రొటీన్ గా రెగ్యులర్ ప్లే తో ఈ ఎపిసోడ్ కొనసాగుతుంది. వీటితో దర్శకుని మ్యాజిక్ మాత్రం ఈ ఎపిసోడ్ లో బాగా మిస్ అయ్యినట్టుగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ ఎపిసోడ్ కి కూడా వేగేశ్న సతీష్ గారి నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా మొత్తం సెటప్ కి కావాల్సిన అంశాలు చక్కగా సెట్ చేసుకున్నారు. దాము నర్రావుల సినిమాటోగ్రఫీ కాలం వెనక్కి తీసుకెళ్తుంది. ఎస్ కే బాల చంద్రన్ సంగీతం బాగుంది. మధు ఎడిటింగ్ కూడా ఓకే. కాస్ట్యూమ్స్ బాగున్నాయి.

ఇక దర్శకుడు వేగేశ్న సతీష్ విషయానికి వస్తే తన గత ఎపిసోడ్స్ తాలూకా మ్యాజిక్ మాత్రం ఈ ఎపిసోడ్ లో మిస్ చేసారని చెప్పక తప్పదు. ముందువి లైన్ ఎలా ఉన్నా కూడా మంచి ఎమోషన్స్ తో సాగాయి. అయితే ఇందులో సరైన ఎమోషన్స్ అంతగా అనిపించవు అలాగే అంత ఎంటర్టైనింగ్ గా కూడా ఈ ఎపిసోడ్ లేదు. వీటితో పాటుగా కథనం కూడా చాలా సోసోగా ఏదో అలా వెళుతుంది అంతే.. వీటితో మాత్రం వేగేశ్న సతీష్ వర్క్ ఈ ఎపిసోడ్ కి అంత రుచించలేదు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘ట్రింగ్ ట్రింగ్’ లఘు చిత్రం మాత్రం ఈటీవీ విన్ వీక్లీ సిరీస్ లో అంత ఆకట్టుకునే విధంగా సాగలేదు అని చెప్పక తప్పదు. చాలా రెగ్యులర్ అండ్ రొటీన్ గా ఈ ఎపిసోడ్ సాగుతుంది. అలాగే ఇపుడు వరకు వచ్చిన అన్ని ఎపిసోడ్స్ లో ఇది వీక్ అని చెప్పొచ్చు. సో ఈ ఎపిసోడ్ మాత్రం స్కిప్ చేసుకుంటే బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు