యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ఇండియాలోనే తనకంటూ ప్రేత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలే జరిగిన సంతోషం అవార్డ్స్ వేడుకలకి ముఖ్య అతిధిగా కమల్ హాసన్ హాజరయ్యారు. ఈ వేడుకలో అక్కినేని నాగేశ్వర రావు, కె. బాలచందర్, శారద, ఏడిద నాగేశ్వరరావు మరియు అంబరీష్ లకు జీవితకాలపు సాఫల్య అవార్డులను బహుకరించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ మా గురువు గారైన కె. బాలచందర్ గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ఇవ్వడమంటే మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అవార్డు ఇచ్చినట్టు. అందరూ మాలో ఉన్న ప్రతిభను చూసి బాలచందర్ గారు మమ్మల్ని ప్రోత్సహించి మాతో సినిమాలు తీశారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రము నిజం కాదు. మాకు ఆయన అవకాశం ఇచ్చే నాటికి మాకు నటనలో ఓనమాలు కూడా రావు. అలాంటి మమ్మల్ని చేరదీసి ఒక అద్భుతమైన శిలని చెక్కినట్టు చెక్కి ఇంతటి నటులని చేశారు. మాకు ప్రతీ చిన్న విషయమూ నేర్పించి ఇంతటి వారిని చేసినందుకు ఆయనకీ ఎప్పటికీ రుణపడి ఉంటామని’ ఆయన అన్నారు.
ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తూ మరియు స్వీయ దర్శకత్వం వహిస్తున్న ‘విశ్వరూపం’ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని అత్యధిక భారీ వ్యయంతో మరియు ఉన్నతమైన సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు.