సమీక్ష-2 : అత్తారింటికి దారేది – ఈ సినిమా విజయానికి తిరుగేది.!

సమీక్ష-2 : అత్తారింటికి దారేది – ఈ సినిమా విజయానికి తిరుగేది.!

Published on Sep 28, 2013 12:50 AM IST
AD1 విడుదల తేదీ : 27 సెప్టెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 4/5
దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నటీనటులు : పవన్ కళ్యాణ్, సమంత, ప్రణిత..

పేరు వింటేనే అభిమానులకు నరనరానా పవర్ పాసయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి రెండోసారి మాటలను తూటాల్లా అందించే దర్శకుడు త్రివిక్రమ్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించగానే అందరి అంచనాలు అంచలంచెలుగా ఎదిగి ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ సినిమాకు ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ ను ప్రకటించినప్పుడు ఒక కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మనకు అందించబోతున్నారని అర్ధమైంది. సమంత అందాలు, ప్రణిత కట్టిన వోణిలు, ఆడియోలో దేవి కొట్టిన బాణీలు ప్రేక్షకులను ఊపిరాడనివ్వకుండా చేసాయి. పైరసీ కష్టాలను, జాప్యం వలను కలిగిన నష్టాలను ధైర్యంగా ఎదుర్కున్న బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ‘అత్తారింటికి దారిని’ ఎలా చూపించాడో చూద్దామా….

కథ :

పుట్టుకతోనే కోట్లకు పడగెత్తి, ఎవ్వరిననైనా తన దమ్ముతో పడగొట్టగలిగిన గౌతం నంద(పవన్ కళ్యాణ్) తాతయ్య రఘునందన్(బొమన్ ఇరానీ)కు చివరిదశలో ఒక చివరికోరిక వుంటుంది. తనకు ఇష్టంలేకుండా వేరొకరిని పెళ్లిచేసుకుందన్న కోపంతో తన కూతురు సునంద(నదియా) ను ఇల్లు వదిలేసి వెళ్లిపొమ్మన్నానని అనుక్షణం బాధపడుతూ వుంటాడు. తను చనిపోయేలోపు కన్న కూతురుని కళ్ళారా చూడాలనివుందని అడగితే, అప్పుడు మనవడైన గౌతం కష్టతరమైన ఆ పనిని ఏం చెయ్యాలో స్పష్టంగా తెలియకపోయినా తాత మీద వుండే ఇష్టంతో తన కోరికను నెరవేర్చడానికి హైదరాబాద్ కు చేరుకుంటాడు

అలా వచ్చిన గౌతంకు తన మరదళ్ళు అయిన శశి(సమంత), ప్రమీల(ప్రణిత) లతో ఎటువంటి పరిచయం ఏర్పడింది?? వారితో ఎవరిచేత ప్రేమగా బావా అని పిలిపించుకున్నాడు?? వీరికీ చిత్తూరులో వుండే సిద్దప్ప (కోట శ్రీనివాసరావు)కు సంబంధం ఏమిటి?? కథలో భాగంగా బద్ధం భాస్కర్(బ్రహ్మానందం) కు చెప్పిన అబద్ధం ఏమిటి?? సునందలో మార్పుతీసుకురావడానికి గౌతం తీసుకున్న నిర్ణయం ఏమిటి అనేది మిగిలిన కధ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో నెంబర్ వన్ ప్లస్ పాయింట్ గా చెప్పాల్సింది ప’వన్’ పెర్ఫార్మెన్స్ గురించే. సినిమా మొత్తాన్నీ తన భుజస్కందాల మీద మోసి విజయ శిఖరాలకు సులువుగా చేర్చగలిగాడు. సినిమాలో అతను ఎంతమందిలో ఉన్నా లక్షణంగా కనిపిస్తూ, తెరపై తక్కిన నటులంతా భటులు అన్నట్టు తనే రాజుగా మన కళ్ళకు రంజుగా కనిపిస్తాడు. స్టైలిష్ అనే పదానికి పాలిష్ పెట్టినట్టు అతని స్క్రీన్ ఎప్పియరెన్స్ అమోఘం. బాపు గారి బొమ్మతో ఇట్స్ టైం టు పార్టీ అంటూ, కాటమరాయుడిని ఏడిపిస్తూ, కిరాక్ స్టెప్పులతో మన చేత కెవ్వు కేక పెట్టించాడు. ఈ ఆరడుగుల బుల్లెట్ సరదాగా సిగ్గుపడే సన్నివేశమయినా, సీరియస్ గా శత్రువులకు షాక్ ఇచ్చే సీన్ అయిన అలా అలవోకగా నటించగలిగాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో అతను నటించాడు అనడం కంటే జీవించాడు అనడం ఉత్తమం.

సమంత ప్రధమార్ధంలో కథానుసారం ఎక్కువ సమయం కనిపించకపోయినా ద్వితీయార్ధంలో చీరకట్టుతో మనల్ని కట్టిపడేస్తుంది. ప్రణిత పాత్ర మేరకు న్యాయం చేసింది. కీలకమైన అత్త పాత్ర కు కొత్త అయినా నదియా ఎక్కడా తడబడకుండా పోషించి దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టింది. రావురమేష్, బొమన్ ఇరానీ, కోట, తదితరులు తమ తమ పాత్రలలో ఒదిగిపోయారు.

స్టార్ హీరో కథలో కంటెంట్, కామెడి, భావోద్వేగ సన్నివేశాలు వుండడం అంటే క్వాలిటీని, క్వాంటిటీ ఒకేసారి రుచి చూసినట్టు. దీన్ని త్రివిక్రమ్ చాలా తెలివిగా కధలో చొప్పించి, ఏ వర్గం ప్రేక్షకులను నొప్పించకుండా జాగ్రత్తపడ్డాడు. ఫ్లాష్ బ్యాక్ సీన్ లకు స్క్రీన్ ప్లే ప్రతిభను వాడుకుని అద్బుతంగా చూపించారు

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. బ్రహ్మి కామెడీ. సెకండ్ హాఫ్ లో జోక్ కి జోక్ కి మధ్య నవ్వుకునే గ్యాప్ ఇవ్వకుండా కడుపుబ్బా నవ్వించాడు. ‘అహల్య అమాయకురాలు’ అనే నాటకంలో, అత్తాపూర్ బాబా సన్నివేశాలలో మనం ఎంత ఆపుకున్నా నవ్వకుండా వుండడం అసంభవం. ఆ రేంజ్ లో బ్రాహ్మి పవన్ ఎపిసోడ్ లను డిజైన్ చేసారు. అలీ, ఎం.ఎస్ అక్కడక్కాడా త్రివిక్రమ్ పంచ్ లను పేల్చి నవ్వించగలిగారు

మైనస్ పాయింట్స్ :

ఓవర్ ఆల్ గా చూస్తే చెప్పుకునేంత మైనస్ పాయింట్ లు ఈ సినిమాకు ఏమి లేవు. పొల్లాచిలో తీసిన సుమో ఛేజ్, టైటిల్ సాంగ్ ల పై మరింత శ్రద్ధ పెట్టి వుంటే ఆ సన్నివేశాలు ఇంకా బాగా పండి ఉండేవి. విజువల్ ఎఫెక్ట్స్ స్థాయికి తగ్గట్టుగా లేవు.

సాంకేతిక విభాగం:

ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ ఈసారి తన పెన్ను పవర్ ను, పవర్ స్టార్ క్రేజ్ రూపంలో వాడుకున్నాడు. పవన్ ఏం చేస్తే అభిమానులు ఎగిరి గంతేస్తారో, పవన్ ఎలా నటిస్తే ఫ్యాన్స్ మనసులను పిండేయగలడో అతనికి బాగా తెలుసు. పతాక సన్నివేశాలలో తను రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. సినిమా నుండి బయటకు వచ్చినా అవి మనల్ని వీడిపోకుండా వెంటాడుతూనే వుంటాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను సినిమాలోకి లీనమయ్యేలా చేసాడు.

నిర్మాత ఖర్చుపెట్టిన ప్రతీ పైసా సినిమాలో రిచ్ గా కనిపిస్తుంది. దానికి ప్రసాద్ అందించిన కెమెరా సహకారం మెచ్చుకోదగినది. ప్రవీణ్ ఎడిటింగ్ బాగానే వుంది.

తీర్పు :

ఆకలి మీద వున్న సింహానికి సరైన ఆహారం దొరికినట్టుగా, సినిమాలు లేక విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టగలిగే సినిమా ‘అత్తారింటికి దారేది’. పవన్ పవర్ మానియా, త్రివిక్రమ్ పెన్ను మాయ కలిస్తే ‘అత్తారింటికి దారేది’. భూతు సినిమాల రాజ్యంలో నభూతో అన్న రేంజ్ లో కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్. పవన్ ఫ్యాన్స్ కు మాత్రం సెప్టెంబర్ లో పండగ లేదన్న బాధ తొలగిపోయింది. పవర్ స్టార్ అభిమానులు కాలర్ ఎగరేసి గర్వంగా సినిమా సూపర్ హిట్ అని చెప్పుకునే సినిమా… ఇంకెందుకు ఆలస్యం మరి మీ దగ్గరలో ఈ సినిమా వున్న థియేటర్ లకు దారేదో కనుక్కోండి..

123తెలుగు.కామ్ రేటింగ్ : 4/5

వంశీ కృష్ణ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు