అదే ట్రెండ్ ఫాలో అవుతున్న అల్లరోడు


సినిమాకి వచ్చిన వారిని తన కామెడీతో 2 గంటల పాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించగల గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు మన కామెడీ కింగ్ అల్లరి నరేష్. నరేష్ యముడికి చుక్కలు చూపించే కుర్రాడి పాత్రతో మళ్ళీ మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి ‘యముడికి మొగుడు’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కి జోడీగా రిచా పనాయ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని పౌరాణిక సన్నివేశాలకు సంబందించిన విజువల్ ఎఫెక్ట్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇ. సత్తి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చంటి అడ్డాల నిర్మిస్తున్నారు.

ఇప్పటివరకూ మన తెలుగులో హీరో యమలోకంకి వెళ్ళడం, అక్కడ యముడికి చుక్కలు చూపించే సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఒక కుర్రాడు యమలోకం వెళ్లి యముడి కూతురుతో ప్రేమలో పడి యముడికి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించడం అనే కథాంశంతో సినిమా తీయడం ఇదే మొదటి సారి. యముడి పాత్రలో సాయాజీ షిండే నటిస్తున్నారు. నరేష్ – సాయాజీ షిండే మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని అంటున్నారు. ఈ సినిమాలో యముడికి భార్యగా విలక్షణ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. మన పెద్ద పెద్ద హీరోలందరూ యముడిని ఆటపట్టించి విజయాలు అందుకున్నారు, ఇప్పుడు అదే యముడి ట్రెండ్ ని మన అల్లరోడు అల్లరి నరేష్ కూడా ఫాలో అవుతున్నారు. నవంబర్లో ఈ చిత్ర ఆడియోని విడుదల చేయనున్నారు.

Exit mobile version