విక్టరీ వెంకటేష్ ఎంతో ఇష్టపడి చేస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ మూవీ ‘ఆసురన్’కు ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్ వెర్షన్ ఎంతో సహజంగా అనిపించడంతో వెంకటేష్ రీమేక్ చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నారు. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం ముగిసింది. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చినట్టు తెలుస్తోంది. వెంకీ, శ్రీకాంత్ అడ్డాల సినిమా వచ్చిన తీరు పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారట. ఈ సినిమాను మే 14న వేసవి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.
కానీ ఆ సినిమాకు ఒక్క రోజు ముందు మే 13న మెగాస్టార్ చిరు ‘ఆచార్య’ రిలీజ్ కానుంది. రెండు సినిమాల తేదీలను కొన్ని గంటల వ్యవధిలోనే ప్రకటించారు. రెండూ పెద్ద సినిమాలే కాబట్టి కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ అంటే బాక్సాఫీస్ క్లాష్ తప్పదు. థియేటర్ల కౌంట్ కూడ బాగా తగ్గిపోతుంది. ఏ సినిమాకూ అధిక సంఖ్యలో స్క్రీన్లు దొరికే వీలుండదు. ఇది రెండు సినిమాలకూ నష్టమే. అందుకే ఈ పోటీని తప్పించడానికి వెంకీయే ముందుడుగు వేసేలా కనిపిస్తున్నారు. ఏప్రిల్ 30న రానా ‘విరాటపర్వం’ తర్వాత మే 10వ తేదీ వరకు ఎలాంటి పెద్ద సినిమాలూ లేవు. అలాగే ‘ఆచార్య’ తర్వాత చూసుకుంటే మే 28న ‘ఖిలాడి’ వస్తుంది. అంటే చిరు సినిమాకు, రవితేజ సినిమాకు 13 రోజుల పైనే గ్యాప్ ఉంది.
ఈ రెండింటిలో ఏదో ఒక ఖాళీని ‘నారప్ప’ బృందం వాడుకునేలా ఉన్నారు. అప్పుడు రెండు సినిమాలకు 10 రోజుల గ్యాప్ దొరుకుతుంది. మోస్ట్లీ ‘విరాటపర్వం, ఆచార్య’ చిత్రాల నడుమ ఉండే ఖాళీలోకే ‘నారప్ప’ విడుదల తేదీ మారే అవకాశముంది. మరి చిత్ర సమర్పకులు సురేష్ బాబు ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి.