సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’ను రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదొక యాక్షన్ కామెడీ ఎంటెర్టైనర్. కాగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి మొదలుకానుంది. మొదట ఈ నెల మూడవ వారం నుండి చిత్రబృందం షూట్ స్టార్ట్ చెయ్యాలని అనుకున్నప్పటికీ.. తాజాగా షూట్ డేట్ ను ఏప్రిల్ ఫస్ట్ వీక్ కి షిప్ట్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ నివేదా – రెజీనాల మీదే షూట్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో నివేదా థామస్, రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో పోలీస్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరూ కొరియన్ యాక్షన్ కొరియోగ్రఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ‘రణరంగం’ ఆశించిన స్థాయిలో ఆడకపోయే సరికి సుధీర్ వర్మకు ఈ సినిమా కీలకంగా మారింది. ఇటీవలే కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ని తెలుగులోకి ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేసి గ్రాండ్ హిట్ అందుకున్న సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాతో కూడా హిట్ కొడుతుందేమో చూడాలి.