మునుపటి ఇండియన్ ఐడల్ విజేత, గాయకుడు శ్రీ రామ్ చంద్ర ఇప్పుడు నటుడిగా మారిన సంగతి మనకు తెలిసిందే. శ్రీ రామ్ చంద్ర నటిస్తున్న ‘ప్రేమా గీమా జాంతానై’ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. శ్రీ రామ్ చంద్రకి జోడీగా బార్బీ నటిస్తున్న ఈ సినిమాకి సుబ్బు దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ జనవరిలో వైజాగ్ లో మొదలైంది. నెల పాటూ జరిగిన చిత్రీకరణలో కొన్ని ముఖ్యమైన సీన్లు, ఒక పాట తీసారు. రెండో షెడ్యూల్ మార్చ్ మొదటి వారంలో మొదలై ఏప్రిల్ మధ్యలో ముగుస్తుంది. ఇందులో మిగిలిన సీన్లను హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాలలో తీయనున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిత్ర బృందం మొత్తం రెండు పాటలకోసం శ్రీలంక వెళ్ళనున్నారు. ఇటీవల కాలంలో రామ్ చరణ్, తమన్నా నటించిన ‘రచ్చ’ సినిమా మాత్రమే శ్రీలంకలో చిత్రీకరించారు. చాలా మంది డైరెక్టర్లు షూటింగ్ కి థాయిలాండ్ లేదా బ్యాంకాక్ ఎన్నుకుంటున్నారు. “తను సాదించాల్సిన లక్ష్యం కోసం ప్రేమ అన్న విషయాన్నే ద్వేషించే తను ఎటువంటి పరిస్థితులలో ప్రేమలో పడ్డాడో అన్నదే ఈ చిత్ర కధాంశం. ఈ సినిమా యువతను తప్పక ఆకర్షిస్తుందని చాలా నమ్మకంగా ఉన్నామని” డైరెక్టర్ సుబ్బు చెప్పాడు. ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది.