సందీప్ కిషన్ హీరోగా పరిశ్రమలో దశాబ్దం పూర్తి చేసుకున్నారు. ఆయన మొదటి చిత్రం ప్రస్థానం 2010 ఏప్రిల్ 16న విడుదలైంది. మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ చిత్రంలో నటించగా సీనియర్ హీరో సాయి కుమార్ ఓ కీలక పాత్ర చేయడం జరిగింది. దేవా కట్ట దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ప్రస్థానం మూవీ సూపర్ హిట్ అందుకుంది. మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం గోవా ఇంటెర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ నందు ప్రదర్శనకు అర్హత సంపాదించింది. 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్ కి సూపర్ హిట్ అందించింది.
తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది వచ్చిన హారర్ థ్రిల్లర్ నిను వీడని నీడను నేనే హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, మంచి వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం సందీప్ తెలుగులో ఏ 1 ఎక్స్ ప్రెస్ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. అలాగే రెండు తమిళ చిత్రాలు సందీప్ ఖాతాలో ఉన్నాయి.