పూరి జగన్నాథ్ సోదరుడు సాయి రామ్ శంకర్ హీరోగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘143, డేంజర్, బంపర్ ఆఫర్’ లాంటి సినిమాలతో మెప్పించిన ఆయన ఆ తర్వాత వరుస పరాజయాలను చవిచూశారు. చివరగా ‘నేనోరకం’ సినిమాతో పలకరించిన ఆయన ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. లాక్ డౌన్ కు కొన్ని నెలల ముందు ఇక సినిమాను స్టార్ట్ చేసి 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. కానీ పరిశ్రమ మూతబడటంతో ఆ సినిమా షూట్ ఆగిపోయింది. మళ్లీ ఈరోజు సోమవారం నుండి షూట్ మొదలైంది.
వీలైనంత త్వరలో చిత్రీకరణను కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు టీమ్. ఈ సినిమాకు ‘రీసౌండ్’ అనే టైటిల్ నిర్ణయించారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండనున్న ఈ చిత్రం ద్వారా ఎస్.ఎస్. మురళీకృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో సాయి రామ్ సరసన రాశీ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ స్వీకర్ అగస్తి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.