
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ “ది రాజా సాబ్” చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.
కానీ, కేవలం ఒక పోస్టర్‌తోనే సరిపెట్టారు మేకర్స్. దీంతో ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సాంగ్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
మోగ్లీ సినిమా పాట లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “మొదటి సింగిల్ నవంబర్ 5న విడుదల అవుతుంది. సినిమా విడుదలకు దగ్గరగా రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం. ది రాజా సాబ్ 2026 జనవరి 9న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది” అని తెలిపారు. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధ్ధి కుమారి హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్. థమన్ అందిస్తున్నారు.