సాహో లాంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అనంతరం ప్రభాస్ చేస్తున్న మరో క్రేజీ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. 1960ల కాలం నాటి పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 150కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు. కథ రీత్యా మెజారిటీ షూటింగ్ యూరఫ్ లో జరగాల్సివుంది. ఐతే సాహో ఫలితం తరువాత ప్రభాస్ ఫోకస్ బాలీవుడ్ పై పడినట్టుంది. అందుకు కారణం సాహో అనూహ్యంగా తెలుగులో పరాజయం పొంది, హిందీలో సూపర్ హిట్ గా నిలిచింది. అక్కడ సాహో 150కోట్లకు పైగా వసూళ్లు సాధించి లాభాలు తెచ్చిపెట్టింది.
ఈ తరుణంలో హిందీ మార్కెట్ పై ప్రభాస్ ద్రుష్టి పెట్టినట్టున్నారు. అందుకే తన లేటెస్ట్ మూవీ హిందీలో విడుదల చేయనుండడంతో పాటు, హిందీ జనాలకు కనెక్ట్ అయ్యేలా నటులను కూడా బాలీవుడ్ కి చెందిన వారిని తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ తన చిత్రం కోసం బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి తో పాటు నటి భాగ్యశ్రీని కూడా తీసుకోవడం జరిగింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్ కూడా నటిస్తారట. ఇలా తన మూవీలో ప్రధాన పాత్రలను బాలీవుడ్ నటులు ఉండేలా ప్రభాస్ చూస్తున్నాడు అనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే మొదటిసారి హీరోయిన్ గా ప్రభాస్ సరసన నటిస్తుంది.