కరోనా పురుగు
కనుమరుగవక మానదు
కాస్త ఓపిక పట్టరాదే
కాలం మారక పోదు
జీతం కోసం
ఇంతకాలం పని చేసావు
జీవితం కోసం
కొంతకాలం పని మానుకోలేవా?
ఏం మనిషివిరా నువ్వు
మైండ్ సెట్ మార్చుకోవు
పేరు కోసం
పరపతి కోసం
డబ్బు కోసం
డాబు కోసం
ఇంతకాలం పాకులాడావు
ఇవేమీ కరోనా జబ్బు నుండి
నిన్ను కాపాడ లేవు
కాస్త ఓపిక పట్ట రాదే
కాలం మారకపోదు
అయినా కరోనా
నీలా నాలా
మొహం చూసి
వడ్డించదు
కులం చూసి
కట్టబెట్టదు
ఉన్న చూపు కాకుండా
చిన్న చూపు అసలే చూడదు
చిన్నో డు పెద్దో డు
ఉన్నో డు, లేనోడు
ఇవేమీ పట్టవు
నువ్వూ నేనూ సమానమే
బొంగూ బోషానమే
కాస్త ఓపిక పట్టరాదే
కాలం మారక పోదు
అవ్వ అయ్య తిడుతున్నా
పని పాట చేయకుండా
తిని ఇంట్లోనే తొంగుంటావు
ఇప్పుడేమో తిని
ఇంట్లోనే తొంగోరా అంటే
రోడ్డెక్కి పెత్తనాలు చేస్తున్నావు
ఏం మనిషివి రా నువ్వు
మైండ్ సెట్ మార్చుకోవు
మన ప్రాణాలకు
తమ ప్రాణాలు అడ్డేసి
నిస్వార్థంతో
నీకు సేవ చేస్తుంటే
వైద్యులతో *వాదులాడేవు*
నలుదిక్కుల ముట్టడించే
కరోనాని కట్టడి చేస్తూ
అహర్నిశలూ శ్రమిస్తుంటే
పోలీసులతో వాగ్వాదాలు చేసేవు
ఏం మనిషివి రా నువ్వు
మైండ్ సెట్ మార్చుకోవు
కాస్త ఓపిక పట్టరాదే
కాలం మారక పోదు
ప్రభుత్వాల ఆదేశాలు
పెద్దోళ్ల సందేశాలు
పెడ చెవిన పెడతావు
పెడదోవ పడతావు
పక్క దేశాల పొరపాట్లు
పడుతున్నా అగచాట్లు
వాటినేమీ పట్టించుకోవా
నీ దాకా వచ్చే దాకా
గుణ పాఠం నేర్చుకోవా
కొంతకాలం ఓర్చుకోలేవా
ఏం మనిషివి రా నువ్వు
మైండ్ సెట్ మార్చుకోవు
కాస్త ఓపిక పట్టరాదే
కాలం మారక పోదు
ఇంటికే పరిమితం చేసిన
కరోనాను ఇంట్లోనే ఉంటూ
తరిమి కొడదాం
కంటికే కనిపించని
కరోనా కంటికి
కనిపించకుండా ఉందాం
ప్రస్తుతం మనం
మన ఆధీనంలో
మన స్వాధీనంలో
భద్రంగా ఉందాం
బాధ్యతతో మెలుగుదాం
మన ఇంట్లోనే మనకు మనం బందీలమై పోదాం…
ఈ రోజు నువ్వు
మా వీధుల్లో వీర విహారం చేయొచ్చు…
దేశదేశాన స్వైర విహారం చేయొచ్చు
విర్రవీగి పోవొద్దు కరోనా
కాలం కలకాలం ఒకేలా ఉండదు
నీకూ కాలం చెల్లిపోయే
రోజు ఒకటి వస్తుంది…
నీ అంతు చూసే రోజు
అతి దగ్గరలోనే ఉంది..
ఒంటరిగా ఉంటూనే
ఒక్కడిగా నీ పై
యుద్ధం ప్రకటిస్తా
విను వీధుల్లో
నా విజయాన్ని
గర్వంగా చాటిస్తా
అందాకా బ్రతికి పో
–సురేష్ గంగుల