విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు అయిన శృతి హాసన్ కథానాయికగా ఇప్పటివరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి అర డజను పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’ మరియు ‘ఓ మై ఫ్రెండ్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఏ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అవకాశం రాగానే చాలా ఎగ్జైట్ అయ్యాననీ, పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా నటిస్తారనీ, డాన్సులు నటన విషయాల్లో ఆయనకి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించాననీ, డైలాగ్స్ తదితర విషయాల్లో రోజూ ప్రాక్టీసు చేసే దానిని అని చెబుతుంది. ఈ సినిమా భారీ విజయం సాధించి తనకు మంచి పేరు తీసుకువస్తుందన్న నమ్మకంతో ఉంది శృతి హాసన్. ఈ సినిమాలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషిస్తున శృతి నటన చూసి పవన్ కూడా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ గబ్బర్ సింగ్ చిత్రం మే నెల రెండవ వారంలో విడుదలకు సిద్ధమవుతుంది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.