పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తయ్యాయి. సెన్సార్ పూర్తయినప్పటి నుంచి ఇండస్ట్రీలోని అందరి నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్నలు ఏమిటంటే ‘గబ్బర్ సింగ్’ రికార్డులని రాంబాబు క్రాస్ చేస్తుందా? పవన్ తన రికార్డులనే తనే బద్దలు కొడతాడా?. పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ కలెక్షన్లు సాధించిన సినిమాల వరుసలో చేరిపోయారు.
ఆ సినిమా విడుదలై ఆరు నెలలు పూర్తికాక ముందే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాతో అక్టోబర్ 18 న మళ్ళీ బాక్స్ ఆఫీసు పై దాడి చేయడానికి వచ్చేస్తున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఎంతో నమ్మకంగా ఉన్నారు. ” నా దమ్మేంటో 18న ప్రూవ్ చేస్తా, ఫాన్స్ గా మీ దమ్మేంటో కలెక్షన్స్ తో ప్రూవ్ చెయ్యండి” అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేసారు.
ఈ చిత్రానికి వస్తున్న పాజిటివ్ టాక్ చూసి పవన్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ దసరాకి భారీ ఎత్తున విడుదలకి సిద్దమవుతుండడం చూస్తుంటే రాంబాబు ఖచ్చితంగా బాక్స్ ఆఫీసు రికార్డులు బద్దలు కొడుతుందని అనిపిస్తోంది. అనుకుంటున్నట్టుగా రాంబాబు గబ్బర్ సింగ్ రికార్డులు క్రాస్ చేస్తే, ఈ సంవత్సరం రెండు హిట్స్ కొట్టి బాగా సంతోషం పొందే హీరో మాత్రం పవన్ కళ్యాణ్.