టాలీవుడ్‌లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం “లిటిల్ హార్ట్స్”లో ‘#90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’తో గుర్తింపు పొందిన శివాని నాగరం హీరో-హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌లో సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య హాసన్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. థియేట్రికల్ రిలీజ్‌ను బన్నీ వాస్ మరియు వంశీ నందిపాటి నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి మూవీ విశేషాలను పంచుకున్నారు.
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘సినిమా కంటెంట్ బాగుందని అనిపించి థియేట్రికల్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో నటించిన వారు కొత్తవాళ్లు కావడంతో ఓపెనింగ్స్ నెమ్మదిగా మొదలయ్యే అవకాశం ఉంది. కానీ మంచి టాక్ వస్తే కలెక్షన్స్ పికప్ అవుతాయి. యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ఎక్కడా అశ్లీలత లేకుండా, కుటుంబం మొత్తం కలిసి చూడగల సినిమా ఇది. చిన్న చిత్రాలకు టికెట్ రేట్లు రూ.150 ఉండాలని మనసులో ఉంది కానీ ప్రాక్టికల్ ఇబ్బందుల వల్ల సాధ్యం కావడం లేదు. ఈ మధ్య యూత్ ఓరియెంటెడ్ ఫన్ మూవీస్ లేవు కాబట్టి మనకిది అడ్వాంటేజ్ అవుతుంది. ఫైనల్ కాపీ చూసిన తర్వాత, 16-20 ఏళ్ల యువతకు సినిమా బాగా నచ్చుతుందని నమ్మకం ఉంది. కథ ఎంసెట్ కోచింగ్, చదువులు, ప్రేమ చుట్టూ సాగుతుంది. ప్రస్తుతం కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తున్నారు. మా సంస్థ నుంచి వచ్చే “మిత్రమండలి” సినిమాను అక్టోబర్ 16న దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్నాం.’ అని అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ‘లిటిల్ హార్ట్స్ 80 శాతం పూర్తయ్యే సమయానికే మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. థియేటర్స్‌లో బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకం కలిగింది. బన్నీ వాస్ బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. యంగ్ టీమ్ కష్టపడి పనిచేసిన ఎనర్జీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈటీవీ విన్ కంటెంట్ ఎప్పుడూ ప్రత్యేకమే. “90s మిడిల్ క్లాస్ బయోపిక్”, “ఎయిర్” లా, ఈసారి “లిటిల్ హార్ట్స్” ఒక అబ్బాయి ప్రేమ సాధించే ప్రయాణాన్ని వినోదాత్మకంగా చూపిస్తుంది. ఈ నెల 3న స్టూడెంట్స్‌కి స్పెషల్ షోలు, 4న పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేసి 170 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం.’ అని అన్నారు.