రామ్ చరణ్ “ఆరెంజ్” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన షాజహాన్ పదమ్సీ తిరిగి తెలుగులో నటించడానికి సకలం సిద్దమయినట్టు తెలుస్తుంది. ఈ మధ్యనే ఒకానొక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాగ చైతన్యతో ఒక చిత్రం ఒప్పుకున్నట్టు తెలిపింది. ఇప్పటికే నాగ చైతన్య రెండు చిత్రాలు చిత్రీకరణ మొదలు పెట్టుకోవాల్సి ఉంది. అక్కినేని నాగేశ్వర రావు మరియు నాగార్జునలతో కలిసి చేస్తున్న ఒక చిత్రం రాధా మోహన్ దర్శకత్వంలో చెయ్యబోతున్న “గౌరవం” మరో చిత్రం. షాజహాన్ పదమ్సీ ఏ చిత్రం ఒప్పుకుందో స్పష్టంగా తెలుపలేదు.
ఈ రెండింటిలో ఏదో ఒక చిత్రంలో నాగ చైతన్య సరసన కనిపించబోతున్నారు. “ఆరెంజ్” చిత్రం తరువాత పూర్తిగా హిందీ మీదే దృష్టి సారించిన ఈ నటి తాజాగా హౌస్ ఫుల్- 2 చిత్రంలో కనిపించారు. ఆరెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా ఆడకపోయినా ఈ నటి అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా “రూబా రూబా” పాటలో అయితే చాలా అందంగా కనిపించింది. మళ్ళీ ఈ చిత్రంలో తన మాయను చూపిస్తుందో లేదో వేచి చూడాలి.